ఆర్కే-7 గనిలో నార్త్​సెక్షన్  మూసివేత!

కోల్​బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లాలోని ఆర్కే-7 సింగరేణి బొగ్గు గనిలో నార్త్​ సైడ్ సెక్షన్ మూసివేయాలని ఫారెస్ట్​ అధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు. ఫారెస్ట్​ పర్మిషన్లు లేవని మైనింగ్ పనులు​ చేపట్టవద్దని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ గనిలో నార్త్​, సౌత్​ సైడ్స్​లో  బొగ్గు వెలికితీత పనులు సాగుతున్నాయి. నార్త్​ సైడ్​ లో పనులు ఎక్స్​టెన్షన్ రెన్యువల్​(లీజ్​)​ కోసం 2018లోనే  సింగరేణి ఫారెస్ట్​ పర్మిషన్లకు  దరఖాస్తు చేసుకుంది.

ఇప్పటివరకు ఎలాంటి పర్మిషన్లు రాలేదు. నార్త్​ సెక్షన్​ మూసివేయనుండడంతో సుమారు 500 మంది కార్మికులను శ్రీరాంపూర్​ ఏరియాలోని ఆర్కే5, ఎస్సార్పీ3, ఇందారం1ఏ గనుల్లోకి డిప్యూటేషన్​పై పంపేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఆర్కే-7 గనిని మూసివేయబోమని, కార్మికులు ఎలాంటి ఆందోళన చెందవద్దని శ్రీరాంపూర్​ ఏరియా జీఎం సంజీవరెడ్డి తెలిపారు.

పర్మిషన్​ చిన్న విషయమేనని, గని మూసివేత తప్పుడు ప్రచారమన్నారు. కాగా, ఆర్కే-7 గనిలో రోజుకు 1200 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుండగా, అందులో 70 శాతం ఇక్కడి నుంచే వస్తోంది. ఆరు ఎస్డీఎల్​ యంత్రాలతో బొగ్గు ఉత్పత్తి ఇక్కడ జరుగుతోంది.