వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

  • మరో నలుగురు విద్యార్థినులకు అస్వస్థత
  • మొత్తం 36కు చేరిన బాధితులు సంఖ్య
  • వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో  సోమవారం రాత్రి మరో నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసిఫాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. దీంతో ఫుడ్ పాయిజన్ బాధితుల సంఖ్య36కు చేరింది. మరో 20 మంది కూడా వాంతులు చేసుకుని స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. ఫుడ్ పాయిజన్ ఘటనలో ఆసిఫాబాద్, వాంకిడి, మంచిర్యాల, హైదరాబాద్ హస్పిటల్లో 17 మంది విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. మంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న తొమ్మిదో తరగతి స్టూడెంట్ శైలజ వెంటిలేటర్ మీద ఉండి కోలుకోగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హైదరాబాద్ నిమ్స్ కు మంగళవారం తరలించినట్లు డీటీటీఓ రమాదేవి చెప్పారు. 

ఆసిఫాబాద్ లో చికిత్స పొందుతున్న నలుగురు విద్యార్థులను ఆమె  పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ పాఠశాలలో వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల పరిస్థితి తెలుసుకునేందుకు రోజూ హాస్టల్ కు వచ్చిపోతున్నారు. 

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణను జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. వాంకిడి హాస్పిటల్ లో బాధిత విద్యార్థులను ఆయన పరామర్శించి మాట్లాడారు. నాణ్యత లేని, కాలం తీరిన సరుకులు సరఫరా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.