పిల్లలకు పౌష్టికాహారం అందించేలా కృషి : ఫహీం

ఆదిలాబాద్/ నిర్మల్, వెలుగు : అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం అన్నారు. సోమవారం ఆదిలాబాద్​జిల్లా కేంద్రంలో ఆయన పర్యటించారు. భుక్తాపూర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు అందిస్తున్న భోజనం, ఇతర సౌకర్యాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం పట్టణంలోని శాంతినగర్, మహాలక్ష్మివాడలోని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. పౌష్టికాహర లోపంతో బాదపడుతున్న పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం అందిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల అంగన్వాడీ కేంద్రాలను గుర్తించి బాలామృతం పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిర్మల్ పట్టణ కేంద్రంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తనిఖీ చేశారు. అంగన్వాడీల్లో పిల్లల హాజరు పరిశీలించి, చిన్నారులకు ఇస్తున్న ఆహార పదార్థాలను తనిఖీ చేశారు.

పిల్లలకు పౌష్టికాహారం క్రమంతప్పకుండా అందించాలని ఆదేశించారు. కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.