తెలుపు రంగు చీరలో నిర్మలమ్మ

 

న్యూఢిల్లీ:  బడ్జెట్ వేళ నిధుల కేటాయింపుపై ఎంత ఆసక్తి ఉంటుందో కేంద్ర ఆర్థిక మంతి నిర్మలాసీతారామన్ ధరించే చీరపైనా అంతే ఆసక్తి ఉంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున ఆమె దేశ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వం, హుందాతనం, గౌరవం ఉట్టిపడేలా కనిపించే చీరలు ధరించడమే అందుకు కారణం. చేనేత చీరలంటే ఎక్కువగా ఇష్టపడే నిర్మలమ్మ ఈసారి కూడా హ్యాండ్లూమ్ సారీనే ధరించారు. ఏపీకి చెందిన 'మంగళగిరి' చేనేత చీరను కట్టుకున్నారు.

 తెలుపు రంగు, బంగారు మెటిఫ్, మెజెంటా అంచుతో కలగలిపిన సిల్క్ చీరలో ఆమె కనిపించారు. మంగళగిరి చీరతో బడ్జెట్‌‌లో ఆంధ్రప్రదేశ్‌‌కు ప్రత్యేక ఆర్థిక మద్దతు ఉన్నదని ముందుగానే సూచించారు. అందుకు తగ్గట్టే ఏపీ వ్యవసాయ అవసరాలకు, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించారు. దీనిబట్టి నిర్మలమ్మ చీరలు..పథకాలకు, కొన్ని రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యం ఇస్తాయని తెలుస్తున్నది. ఇప్పటిదాకా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు క్రియేట్ చేసిన ఆమె..ప్రతీసారి ఏదో ఒక స్పెషాలిటీ ఉన్న చీరను ధరించే బడ్జెట్ ను ప్రవేశపెడుతూ
వస్తున్నారు.