రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు

జోగిపేట,వెలుగు: జోగిపేట పట్టణంలో జోగినాథస్వామి ఉత్సవాలలో భాగంగా జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో  రావణసురుని ప్రతిమకు తుది మెరుగులు దిద్దుతుండగా  ఈదురు గాలికి అది కూలిపోయింది. దీంతో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి.   సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.   ఉత్సవాలలో   చివరి ఘట్టమైన లంకాదహనం కార్యక్రమం కోసం  వారం రోజులుగా కార్మికులు50 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో  రావణసురుని ప్రతిమను తయారు చేశారు.    

కార్మికులు తయారు చేసిన ప్రతిమను    నిలబెట్టి తుదిమెరుగులు  దిద్దుతున్న సమయంలో ఈదురు గాలులు వీయగా..  ప్రతిమ ఒక్కసారిగా    కుప్పకూలి పోయింది.  దీంతో   కార్మికులు ప్రతిమతో పాటు కింద పడిపోయారు. ఇందులో ప్రవీణ్ ముఖానికి తీవ్రగాయాలు అయ్యాయి.  వెంకటయ్యకు చేతులు విరిగాయి. జానకిరామ్​కు,  మహేందర్​కు  దెబ్బతగిలింది. రాములు కాలి వేళ్లు విరిగాయి. వీరిని జోగిపేట హాస్పిటల్​లో  ప్రథమ చికిత్స చేసి సంగారెడ్డి గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించారు.  వీళ్లంతా హైదరాబాద్​కు  చెందిన వారు.  ప్రతి ఏడాది రావణుని ప్రతిమను తయారు చేస్తుంటారు.  ఘటన జరిగిన వెంటనే జోగిపేట  సీఐ అనిల్​కుమార్, ఎస్​ఐ అరుణ్​కుమార్​లు అక్కడికి చేరుకున్నారు.