శ్రీకాంత్​ బ్రెయిన్​డెడ్​ కేసులో ఐదుగురు అంబులెన్స్​ డ్రైవర్ల అరెస్ట్

  • జీవన్​దాన్ ట్రస్టు ద్వారానే అవయవాల దానం  
  • ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదన్న పోలీసులు 
  • ఎంక్వైరీ జరుగుతోందన్న డీసీపీ  

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​మండలం శెట్​పల్లికి చెందిన రేవెళ్లి శ్రీకాంత్​(35) బ్రెయిన్​ డెడ్​ కాగా, అతడి ఆర్గాన్స్ ​డొనేషన్ ​జీవన్​దాన్​ ట్రస్ట్​ ద్వారానే జరిగిందని,  ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని డీసీపీ ఏ.భాస్కర్​ తెలిపారు. అయితే, పేషెంట్ ​కుటుంబసభ్యులను తప్పుదారి పట్టించి డాక్టర్లు రెఫర్​ చేసిన హాస్పిటల్స్​కు కాకుండా వారికి కమీషన్లు ఇచ్చే హాస్పిటల్స్​కు తరలించినందుకు ఐదుగురు అంబులెన్స్​ డ్రైవర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు తెలిపారు. సోమవారం మంచిర్యాల ఏసీపీ ఆఫీసులో ప్రెస్​మీట్​నిర్వహించారు. 

శ్రీకాంత్​ మంచిర్యాలలోని మయూరి హాస్పిటల్​లో ఆపరేషన్​ థియేటర్​ టెక్నీషియన్. ఈ నెల 6న శెట్​పల్లి దగ్గర జీపీ ట్రాక్టర్​ ఢీకొనడంతో తల పగిలింది. మయూరి హాస్పిటల్​కు తరలించగా కండీషన్ ​సీరియస్​గా ఉందని డాక్టర్లు కరీంనగర్​లోని భద్రకాళి హాస్పిటల్​కు రెఫర్​ చేశారు. శ్రీకాంత్​ భార్య స్వప్న, కుటుంబసభ్యులు కరీంనగర్​కు తీసుకెళ్తుండగా మంచిర్యాలలోని ఆర్​బీహెచ్​వీ స్కూల్​ దగ్గర అంబులెన్స్​ డ్రైవర్లు కిరణ్, నరేశ్, శ్రావణ్​(నాని), సాయి అంబులెన్స్​ను ఆపి భద్రకాళి హాస్పిటల్​కు వద్దని, కెల్విన్​ హాస్పిటల్​కు తీసుకెళ్దామని చెప్పారు. 

శ్రావణ్​, నరేశ్ ​కూడా అదే అంబులెన్స్​లో ఎక్కి వెళ్లారు. కిరణ్​, సాయి కారులో ఫాలో అయ్యారు. దారిలో ఇందారం దగ్గర మరో డ్రైవర్​ సాగర్​ వీరితో కలిసి కెల్విన్ ​హాస్పిటల్​కు తీసుకెళ్లారు. శ్రీకాంత్​ పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన డాక్టర్లు ​యశోద హాస్పిటల్​కు రెఫర్​ చేయడంతో అంబులెన్స్​లో బయల్దేరారు. గజ్వేల్​ దగ్గరకు చేరుకునేసరికి యాదగిరి అనే వ్యక్తి శ్రీకాంత్​ భార్యకు ఫోన్​ చేసి కామినేని హాస్పిటల్​లో డిస్కౌంట్​ ఉంటుందని చెప్పి అక్కడికి పంపించాడు. 

ఈ నెల 8న డాక్టర్లు బ్రెయిన్​ డెడ్​ అయినట్లు నిర్ధారించి జీవన్​దాన్​ టస్ర్టు ద్వారా ఆర్గాన్స్​ డొనేషన్​ చేయాలని పేషెంట్​ కుటుంబీకులను ఒప్పించగా ఏడు అవయవాలను దానం చేశారు. కెల్విన్​ హాస్పిటల్​లో ఉన్నప్పుడే అంబులెన్స్​డ్రైవర్లు శ్రీకాంత్​అవయవాలను దానం చేయాలని సూచించడం, వారు చెప్పినట్టు యశోద హాస్పిటల్​కు కాకుండా కామినేని హాస్పిటల్​కు తీసుకెళ్లడంతో.. కమీషన్లు రాలేదనే అక్కసుతో వారే..శ్రీకాంత్​ బావమరిది రాజుకు ఫోన్​ చేసి అవయవాలను దానం చేసి డబ్బులు తీసుకున్నారని తప్పుడు ప్రచారం చేశారని పోలీసులు వెల్లడించారు. 

కమీషన్లకు ఆశపడి న్యూరో స్పెషలిస్ట్​ ఉన్న భద్రకాళి హాస్పిటల్​కు కాకుండా న్యూరో స్పెషలిస్ట్​ లేని కెల్విన్​ హాస్పిటల్​కు తీసుకెళ్లి సరైన వైద్యం అందకుండా చేసినందుకు ఐదుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశామని తెలిపారు. ఈ కేసులో సాంకేతిక ఆధారాలు, హైదరాబాద్​లో వీరికి సహకరించే వ్యక్తుల గురించి ఎంక్వైరీ చేయాల్సి ఉందని డీసీపీ తెలిపారు. 

ఎన్నో అనుమానాలు! 

శ్రీకాంత్​ కేసులో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కరీంనగర్​లో బ్రెయిన్​ డెడ్​గా నిర్ధారించకముందే అంబులెన్స్​ డ్రైవర్లు ఆర్గాన్స్ ​డొనేషన్ ​చేయాలంటూ శ్రీకాంత్​ భార్యపై ఎందుకు ఒత్తిడి చేశారు? వీరు యశోద హాస్పిటల్​కు వెళ్తుండగా కామినేని హాస్పిటల్​కు తీసుకెళ్లాలని ఫోన్​ చేసిన యాదగిరి ఎవరు? అతడికి శ్రీకాంత్​ను యశోదకు తీసుకెళ్తున్న విషయం ఎట్లా తెలిసింది? అనేది తెలియట్లేదు. డొనేషన్​ తర్వాత తమకు రూ.3లక్షలు ఇచ్చారని, ఈ వ్యవహారంలో లక్షలు చేతులు మారాయని శ్రీకాంత్​ భార్య, బావమరిది ఇదివరకే ఆరోపించారు. దీంతో సహజంగానే ఇందులో ఏదో జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.