ఆస్తి కోసం తండ్రి హత్య.. వేములవాడలో ఘటన

  • తండ్రితో పాటు పినతల్లిపై కత్తితో దాడి చేసిన యువకుడు
  • ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్న పినతల్లి పద్మ
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఘటన

వేములవాడ, వెలుగు: ఆస్తి కోసం ఓ యువకుడు తన తండ్రితో పాటు పినతల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తండ్రి చనిపోగా, పినతల్లి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటోంది. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదివారం జరిగింది. 

వేములవాడ పట్టణంలోని భగవంతరావునగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన మామిండ్ల మల్లయ్య (49) మొదటి భార్య బాలవ్వ చనిపోవడంతో పద్మను రెండో పెండ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు రాజు అనే కుమారుడితో పాటు ముగ్గురు కుమార్తెలు ఉండగా, రెండో భార్యకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మల్లయ్య కొంత కాలంగా మొదటి భార్య పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో పాటు ఆస్తిని రెండో భార్యకు, ఆమె పిల్లలకే ఇస్తున్నాడంటూ మొదటి భార్య కుమారుడైన రాజు కొంతకాలంగా తండ్రితో గొడవ పడుతున్నాడు.

ఈ క్రమంలోనే ఆదివారం కులపెద్దలు, బంధువుల సమక్షంలో ఆస్తి విషయంపై తండ్రిని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రాజు తండ్రి మల్లయ్యతో పాటు పినతల్లి పద్మపై కత్తితో దాడి చేశాడు. గమనించిన స్థానికులు ఇద్దరిని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. ఈ క్రమంలో మల్లయ్య చనిపోగా, పినతల్లి పద్మ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరప్రసాద్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.