బంగారం ధరలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలివే..

భారత్ లాంటి దేశాలలో ఏ శుభకార్యం చేయాలన్నా బంగారం ఉండాల్సిందే. ముఖ్యంగా వివాహాది కార్యక్రమాలకు బంగారం లేనిది పనే జరగదు. అలాంటి బంగారం ధరలు ఉన్నట్లుండి ఒక్క ఏడాదిలోనే అమాంతం పెరిగి పోవడంతో సామాన్యులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. 2023  నుంచి 2024 వరకు సుమారు 30 శాతం పెరిగి ఆకాశాన్ని తాకింది.  10 గ్రాముల 24 - క్యారట్ల గోల్డు గతేడాది 58,500 రూపాయలు ఉండగా.. 2024లో 78 వేలకు చేరుకుంది.  అయితే ఈ గోల్డు రేట్ల పెరుగుదలను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో చెప్పాలని పార్లమెంటులో ప్రశ్నించారు ఎంపీలు.

ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి సమాధానం ఇచ్చారు.  కేంద్ర ప్రభుత్వం 2024 -25 బడ్జెట్ లో బంగారం దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.  భారత్ లో గోల్డ్ వినియోగం మరింత పెంచేందుకు, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కస్టమ్స్ డ్యూటీని తగ్గించినట్లు తెలిపారు. 

అదే విధంగా ఎక్కువ ధరలలో బంగారాన్ని రిజర్వు బ్యాంకు కొనడంపై అడిగిన ప్రశ్నలకు గోల్డ్ అనేది ఫారెన్ ఎక్స్ ఛేంజి నిల్వలకు సంబధించి రిజర్వు బ్యాంకు కొంటుందని అన్నారు. గోల్డ్ పారెన్ ఎక్స్ ఛేంజి రిజర్వ్స్ విలువ మార్చి 2023 నాటికి 7.8 శాతం ఉండగా మార్చి 2024 నాటికి 8.15 శాతానికి పెరిగిందని అన్నారు. 

అయితే బంగారం ధరల పెరుగుదలపై ప్రభుత్వం నిశితంగా గమనిస్తుందని, కస్టమ్స్ డ్యూటీ తగ్గించి సామాన్యులకు అందుబాటు ధరలలోకి తీసురావాలనే ప్రయత్నం చేశామని అన్నారు. కానీ పండగలు, పెళ్లిళ్ల సీజన్ లో పెరిగే ధరలను నియంత్రించలేమని తెలిపారు. గోల్డ్ ప్రైస్ కంట్రోల్ చేసేందుకు ప్రస్తుతం ఎటువంటి వ్యూహాలు లేవని జవాబిచ్చారు.