- 8 శాతం తేమతో సీసీఐ ధర రూ. 7,521 నిర్ణయం
- రూ. 7,200 కొనుగోలు చేస్తామన్న ప్రైవేట్ వ్యాపారులు
- ఉదయం నుంచి రాత్రి వరకు కొనుగోలు నిలిపివేత
- పలుమార్లు అధికారులు, రైతులతో కలెక్టర్ చర్చలు
- మార్కెట్ యార్డులో బారులు తీరిన వాహనాలు
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులోనూ పత్తి మద్దతు ధర, తేమ లొల్లితో రైతులు రోడ్డెక్కారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన మార్కె ట్ యార్డులో పత్తి కొనుగోలుకు వేలం పాట చేపట్టారు. ముందుగా సీసీఐ ఆధ్వర్యంలో 8 శాతం తేమతో క్వింటాలుకు రూ. 7,521 ధర నిర్ణయించారు. అనంతరం ప్రైవేట్ వ్యాపారులు వేలంలో పాల్గొనగా సీసీఐ మద్దతు ధర కంటే తక్కువగా పాట ప్రారంభించారు. ప్రతి ఏడాదిలాగే వ్యాపారులంతా ఒకే ధర రూ. 6,700 చెల్లిస్తామని స్పష్టంచేశారు. దీంతో మార్కెట్ అధికారులు ధర పెంచాలని సూచించినా ఒప్పుకోలేదు. చివరకు మరో రూ. 100 అదనంగా పెంచి రూ. 7,150తో ముగించారు. అనంతరం కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవి, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి పత్తి కాంట వద్ద పూజలు చేసి కొనుగోలు ప్రారంభించారు.
తేమ శాతం పరిశీలించడంతో దాదాపు ఒక్కో దాంట్లో 20 శాతంపైగానే చూపించింది. ఇటీవల వర్షాలు పడడం, మంచువల్ల పత్తిలో తేమ శాతం ఎక్కువగానే ఉంటుందని, అధికారులు మద్దతు ధర పెంచేలా చూడాలని రైతులు కోరారు. వ్యాపారులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో కొనుగోలు ఆగిపోయింది. మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కడంతో తొలిరోజు కొనుగోలు చేయకుండానే ముగిసింది.
వ్యాపారులతో కలెక్టర్ పలుమార్లు చర్చించినా ఫలితం లేకుండా పోయింది. ధర పెంచి న్యాయం చేయాలని ఓ రైతు కలెక్టర్ కాళ్లమీద పడ్డాడు. వ్యాపారులు మొదట రూ. 7,150 నిర్ణయించగా, రైతుల ఆందోళనతో మరో రూ. 50 పెంచి రూ. 7,200 ప్రకటించారు. అయితే ప్రస్తుత తేమ శాతంతో ధరలో కోత విధిస్తారనే రూ. 7,200 సరిపోదంటూ రైతులు వాపోయారు. సాయంత్రం 4 గంటల తర్వాత మార్కెట్ యార్డు గేటును మూసివేయగా.. రైతులు కొద్దిసేపు ధర్నా చేపట్టారు. అనంతరం 5 గంటలకు టౌన్ లోని పంజాబ్ చౌక్ లో పెద్ద ఎత్తున రాస్తారోకో తీశారు.
రాత్రి 7 గంటల వరకు రోడ్డుపైనే బైఠాయించగా.. ట్రాఫిక్ జామ్ అయింది. కాగా.. పత్తి కొనుగోలు ప్రారంభ రోజు కావడంతో చాలామంది రైతులు తెల్లవారు జామునే మార్కెట్ కు పత్తిని తరలించారు. మొదటిరోజు వచ్చిన పత్తికి ఎలాంటి తేమశాతం తో సంబంధం లేకుండా ప్రైవేట్ వ్యాపారులు రూ.6,696 తో కొనుగోలు నిర్ణయించారు. శనివారం నుంచి పత్తి కొనుగోలు జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఏనుమాముల మార్కెట్ లోనూ..రైతు సంఘ నేతలతో చర్చించిన జిల్లా అధికారులు
వరంగల్ సిటీ, వెలుగు : పత్తి రైతులు ఆందోళనకు దిగారు. దీంతో మూడున్నర గంటల పాటు కాంటా నిలిచిపోయింది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం ఉదయం 8 గంటలకు కొనుగోలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. క్వింటా పత్తి రూ. 7,000 పలికింది. దీంతో రైతులు గురువారం ధర 7,050 పలికితే.. రూ. 50 ఎందుకు తగ్గించారని ఆందోళనకు దిగారు. మార్కెట్ కార్యదర్శి నిర్మల జిల్లా కలెక్టర్‌తోపాటు ఏనుమాముల సీఐకి సమాచారం అందించారు. అనంతరం అధికారులు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో పాటు రైతు సంఘ నేతలతో మాట్లాడారు. అప్పటికే 11:30 అయింది. పత్తి కొనుగోలు చేపట్టారు. అనంతరం చాంబర్‌ఆఫ్ కామర్స్‌అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పత్తిలో తేమ శాతం 18 వరకు ఉన్నా కొనుగోలు చేయాలని కోరుతూ సీసీఐ, మార్కెటింగ్‌శాఖ అధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు. ముందుగా రైతు సంఘం నేత చందర్రావుకు ఏనుమాముల సీఐ రాఘవేందర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. వ్యాపారులు పత్తి ధర తగ్గించడంతో రైతులు ఆందోళన చేసినట్టు కలెక్టర్ కు మార్కెట్ కార్యదర్శి నిర్మల వివరించారు.