కాగజ్ నగర్, వెలుగు: అధికారుల తీరుతో చేతికొచ్చిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, లో ఓల్టేజ్ తో మోటార్లు కాలిపోతున్నాయని అధికారుల తీరును నిరసిస్తూ కౌటాల మండలంలోని రైతులు ఆందోళనకు దిగారు. గుండాయిపేట్ సబ్ స్టేషన్ పరిధి తాటిపల్లి, పార్డీ, సాండ్ గామ్, బాలేపల్లి, గుడ్లబోరి, తుమ్ముడిహెట్టి, మొగడ్ దగడ్ గ్రామాలకు చెందిన రైతులు, వినియోగదారులు సోమవారం మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్దకు తరలివచ్చి ఆందోళన చేపట్టారు.
ఇండ్లకు, వ్యవసాయానికి ఇచ్చే కరెంట్ లోవోల్టేజీ, కోతలతో కనీసం గంట సేపు కూడా ఉండడం లేదని ఆరోపించారు. పొట్ట, గొల దశలో ఉన్న వరితో పాటు కాయ పగిలే దశకు వచ్చిన పత్తి పంటకు కూడా నీళ్లు పెట్టే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. సబ్ స్టేషన్ లో ఉన్న వారికి సమస్య చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్నా ఎవరూ స్పందించకపోవడంతో అక్కడ నుంచి మెయిన్ రోడ్ మీదకు వెళ్లి బైఠాయించారు. అధికారుల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. చివరకు 3 గంటల తర్వాత సమస్యను తీర్చేందుకు బూస్టర్ ఫిటింగ్ చేస్తామని తర్వాత ఏఏఈ రవీందర్ లెటర్ పంపడంతో ఆందోళన విరమించారు.