- సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఇటుకల పహాడ్ పోడు రైతుల ఆందోళన
- వేరే చోట అయినా భూములు ఇప్పించాలని వినతి
కాగ జ్ నగర్, వెలుగు: కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిర్పూర్(టి) మండలం ఇటుకల పహాడ్ గ్రామ పోడు రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. తాము 40 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని, లేదంటే వేరేచోట భూమి ఇప్పించాలని కోరారు. కొంతకాలంగా ఇటికల పహాడ్ గ్రామంలో పోడు సమస్య నడుస్తోంది. గ్రామం మొత్తం రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని అధికారులు గ్రామస్తులకు నోటీసులు ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఆ గ్రామస్తులు హైదరాబాద్‌కు వెళ్లి మంత్రి సీతక్కను కలిసి సమస్య వివరించగా.. పరిష్కరించి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆమె అధికారులకు సూచించింది. దీంతో ఆఫీసర్లు గత నెలలో గ్రామంలో సర్వే చేసినప్పటికీ గ్రామస్తులకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే వారంతా సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఇప్పుడున్న చోట కాకపోయినా వేరే చోట అయినా రెవెన్యూ భూమి ఇప్పించాలని కోరారు. స్పందించిన సబ్ కలెక్టర్ సమస్య పై ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో మాట్లాడుతానని వారిని సముదాయించారు.