జీలుగ విత్తనాల కోసం బారులు తీరిన రైతులు

దుబ్బాక, వెలుగు: వర్షాకాలం సీజన్​ ప్రారంభం కావడంతో జీలుగ, జనుము విత్తనాల డిమాండ్​ పెరిగింది. దుబ్బాక, మిరుదొడ్డి మండల ఆగ్రో కేంద్రాల్లో మంగళవారం విత్తనాలు ఉన్నాయని తెలియగానే రైతులు క్యూలైన్లో నిలబడి తీసుకెళ్లారు. ఆగ్రో కేంద్రాల వద్ద రైతులు ఉదయం 8 గంటల నుంచే క్యూ లైన్లో నిలబడి బారులు తీరారు.  సరిపడ విత్తనాలు సరఫరా చేయాలని రైతులు డిమాండ్​ చేశారు.  

క్యూ లైన్లో నిలబడ్డ రైతులకు విత్తనాలు ఇవ్వకుండా దొడ్డి దారిన వచ్చిన వాళ్లకు ఇవ్వడంతో లైన్లో నిలబడ్డ రైతులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రో కేంద్రాల వద్ద గంటల తరబడి నిల్చున్నా బస్తాలు అందకపోవడంతో రైతుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు, వ్యవసాయాధికారులొచ్చి బస్తాలను పంపిణీ చేసి పరిస్థితిని చక్కదిద్దారు.  

దుబ్బాక మండలంలో 633 బస్తాల జీలుగ, 125 బస్తాల జనుము విత్తనాలను, మిరుదొడ్డి మండలంలో 225 జీలుగ బస్తాల విత్తనాలను ఇప్పటికే రైతులకు అందజేసినట్లు ఏవోలు తెలిపారు. విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు సరిపోను విత్తనాలను ప్రతి రోజు సరఫరా చేస్తామని దుబ్బాక ఏవో ప్రవీణ్​ తెలిపారు. 

జీలుగ, జనుము విత్తనాల కోసం రైతుల క్యూ

పుల్కల్, వెలుగు:  సంగారెడ్డి జిల్లా పుల్కల్​ మండలంలో జనుము, జీలుగ విత్తనాల కోసం రైతులు పడిగాపులు పడ్డారు. మంగళవారం విత్తనాలు పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారులు చెప్పడంతో రైతులు ఉదయం 7 గంటలకు మండలకేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు చేరుకున్నారు. మండలానికి  600 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు అవసరముండగా, 380 క్వింటాళ్లు మాత్రమే రావడంతో కొద్ది మంది రైతులకు మాత్రమే పంపిణీ చేశారు. దీంతో రైతుల మధ్య తోపులాట జరిగింది. దీనిపై ఏవో చైతన్యను ప్రశ్నించగా, రెండు రోజుల్లో సరిపడ విత్తనాలు వస్తాయని, అందరికీ పంపిణీ చేస్తామన్నారు.