నర్సాపూర్, వెలుగు : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తి సబ్ స్టేషన్ ను సోమవారం రైతులు ముట్టడించారు. గ్రామాల్లో ట్రిప్ అవుతూ కరెంట్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆగ్రహించారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు పోయిన కరెంటు మరుసటి రోజు ఉదయం 9 గంటలకు వచ్చిందన్నారు. తరచుగా కరెంటు ట్రిప్ కావడంతో టీవీలు, ఫ్రిజ్ లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
సబ్ స్టేషన్ సిబ్బంది, ఆఫీసర్ల నిర్లక్ష్యంతోనే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ ఏడీ అక్కడికి వచ్చి సమస్య రాకుండా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.