రామాయంపేట, వెలుగు : తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేటలో రైతులు సిద్దిపేట రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. తూకం వేసి వారం రోజులవుతున్నా రైస్ మిల్లులకు తరలించడం లేదని, దీంతో ధాన్యం బస్తాలు వర్షాలకు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంటపాటు ఆందోళన చేయడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచి పోయాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపచేశారు.
లారీలు రావడం లేదంటూ...
పాపన్నపేట : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మిన్పూర్లో ధాన్యం తరలించేందుకు లారీలు రావడంలేదని శుక్రవారం రైతులు రోడ్డెక్కారు. మెదక్, బోడ్మట్పల్లి మెయిన్ రోడ్డుపై మొలకెత్తిన వడ్లతో రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. తహసీల్దార్ లక్ష్మణ్ బాబుకు ఫోన్‌చేయగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని, ఆయనను సస్పెండ్ చేయాలంటూ భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి సర్ధి చెప్పబోగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు తహసీల్దార్లక్ష్మణ్ వచ్చి సారీ చెప్పడంతో ఆందోళన విరమించారు.
తూకం వేయట్లేదని, ట్రాన్స్పోర్ట్ చేయట్లేదని..
మోత్కూరు: కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదని, తూకం వేసిన వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం లేదని ఆగ్రహిస్తూ యాదాద్రి జిల్లా ఆత్మకూరు (ఎం)లో భువనగిరి-– మోత్కూర్ రోడ్డుపై రైతులు బైఠాయించారు. వీరికి
బీఆర్‌ఎస్, బీజేపీ లీడర్లు మద్దతు పలికారు. రైతులు మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా వడ్లు తడిశాయని, వాటిని కొనాలని, రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కిందకు దిగి లీడర్లను నిలదీయడంతో నిరసన విరమించారు.
తరలించకపోవడంతో తడుస్తుందంటూ..
రాయికల్ : కేంద్రానికి వడ్లు తెచ్చి 25 రోజులవుతున్నా పట్టించుకోవడం లేదని, కొన్నవాటిని మిల్లుకు తరలించడం లేదంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్లో కోరుట్ల–రాయికల్ మెయిన్ రోడ్డుపై రైతులు బైఠాయించారు. సొసైటీ కొనుగోలు కేంద్రంలో ఆరుగురు హమాలీలతో తూకం వేస్తున్నారని, తూకం వేసిన ధాన్యాన్ని లారీల కొరత ఉందంటూ మిల్లుకు తరలించకపోవడంతో వర్షంతో తడిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే ధాన్యం తడిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓను ప్రశ్నించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లుపద్మయ్య, ఏఎస్ఐ దేవేందర్ పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని నచ్చజెప్పడంతో విరమించారు. ధర్నాతో రెండువైపులా ట్రాఫిక్ భారీగా స్తంభించింది.