భూమికి భూమే పరిష్కారం .. లేదంటే ఎకరాకు రూ.కోటీ ఇవ్వాలె 

  •  సంగారెడ్డి కెనాల్ కు భూమి ఇచ్చేందుకు రైతుల కండీషన్

మెదక్, శివ్వంపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భాగంగా నిర్మించతలపెట్టిన సంగారెడ్డి కెనాల్​ కు భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర పరిహారం తమకు అక్కర లేదని, భూమికి భూమి ఇస్తేనే ఒప్పుకుంటామని తేల్చి చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని కొండపోచ్చమ్మ సాగర్ నుంచి కాల్వ ద్వారా సంగారెడ్డి జిల్లాలోని సింగూర్​ ప్రాజెక్ట్​ను నింపేందుకు గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో ప్రణాళిక రూపొందించారు. సంగారెడ్డి కాల్వ నిర్మాణానికి గాను మెదక్​ జిల్లాలోని మనోహరాబాద్​, శివ్వంపేట, నర్సాపూర్​ మండలాల పరిధిలో భూమి సేకరించాల్సి ఉంది.

ఇందుకు సంబంధిత అధికారులు గతంలోనే సర్వే నిర్వహించి ఏ గ్రామ పరిధిలో ఎంత మంది రైతుల నుంచి ఎంత మేర భూమి సేకరించాల్సి ఉందనేది గుర్తించారు. ఇప్పుడు ​భూసేకరణపై రైతుల​ అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. అయితే ప్రభుత్వం ఎకరాకు ఎంత పరిహారం ఇస్తామనేది ఇంతవరకు స్పష్టంగా ప్రకటించలేదు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

అయితే ప్రస్తుతం మార్కెట్లో భూముల విలువ బాగా పెరగడంతో ప్రభుత్వం ఆ స్థాయిలో పరిహారం ఇవ్వదని దానివల్ల తాము తీవ్రంగా నష్టపోతామంటున్నారు. భూమికి బదులు అంతే భూమి మరోచోట చూపించాలని, లేదా ఎకరాకు రూ.కోటి నుంచి రూ.కోటిన్నర ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. ఇదే డిమాండ్​ లతో శివ్వంపేట, నర్సాపూర్​ మండలాల రైతులు శుక్రవారం నుంచి రెవెన్యూ డివిజన్​ కేంద్రమైన నర్సాపూర్​లో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ప్రభుత్వం తమకు న్యాయమైన పరిహారం ఇచ్చేందుకు అంగీకరించే వరకు దీక్షలు కొనసాగిస్తామంటున్నారు.

ఉన్న భూమి పోతే ఎట్లా బతకాలి

మాకు ఉన్న మూడెకరాల భూమి సంగారెడ్డి కెనాల్​లో పోతోంది. భూమి మొత్తం పోతే ఎలా బతకాలి. ఈ కాలువ పనులు క్యాన్సిల్​ చేసే వరకు దీక్ష కొనసాగిస్తాం. ప్రాణాలు పోయినా సరే భూమి మాత్రం ఇచ్చేది లేదు. 

మహేశ్ గౌడ్, రైతు, చిన్నచింతకుంట

ఆడపిల్లల పెండ్లిళ్లు ఎట్లా చేయాలే

నా భూమి ఎకరా పోతుంది. ఇంకా నాకు మిగిలేది 20 గుంటలే.  నాకు ఆడపిల్లలు పెళ్లిళ్లకు ఉన్నారు. భూమి పోతే వాళ్ల పెళ్లిల్లు ఎట్లా చేయాలే. మేము ఎట్లా బతకాలే. భూమికి భూమి ఇవ్వాలి. లేదంటే ఎకరాకు కోటిన్నర పరిహారం  ఇవ్వాలి. అట్లయితేనే భూమి ఇస్తాం లేదంటే లేదు.

కుమ్మరి వీరస్వామి, రైతు, చిన్నగొట్టిముక్కుల