అధికారులు న్యాయం చేయకుంటే.. పురుగుల మందు తాగి చస్తం

  • మా భూమి వేరొకరికి పట్టా చేశారని రైతు కుటుంబం ఆందోళన 
  • కొడుకులు పట్టించుకోవడం లేదని వృద్ధ దంపతుల నిరసన
  • ఆసిఫాబాద్ జిల్లా కౌటాల తహసీల్దార్ ఆఫీసు వద్ద ఘటనలు

కాగజ్ నగర్, వెలుగు : భూమిని వేరే వ్యక్తి పేరిట పట్టా చేసి రెవెన్యూ అధికారులు అన్యాయం చేశారని పురుగుల మందు డబ్బా పట్టుకుని ఓ రైతు తన కుటుంబంతో తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళన చేసిన ఘటన సోమవారం ఆసిఫాబాద్​జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కౌటాల మండలం గుండాయి పేట్ కు చెందిన మండవగడే పత్రుకు గ్రామ శివారులో 167/28 లో 5 ఎకరాల పట్టా భూమి ఉంది. గతేడాది అట్టి భూమిని గ్రామానికి చెందిన ఎల్ముల భావ్ రావ్  పేరిట రెవెన్యూ అధికారులు పట్టా చేశారు. 

దీంతో  రైతు పత్రు తహసీల్దార్ కు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. దౌర్జన్యంగా తన భూమిని భావ్ రావ్ సాగు చేస్తున్నాడని సిర్పూర్ టీ కోర్టులో అతను కేసు వేశాడు. అది కోర్టులో కేసు నడుస్తుండగానే భావ్ రావ్ సాగు చేసుకుంటున్నాడని, తనకు రెవెన్యూ అధికారులు న్యాయం చేయపోతే కుటుంబంతో కలిసి పురుగుల మందు తాగి చనిపోయేందుకు తహసీల్దార్ ఆఫీసు వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశాడు.  

దీనిపై కౌటాల తహసీల్దార్ పుష్పలత స్పందించి పాత రికార్డులను పరిశీలించి తగు చర్యలు తీసుకుని న్యాయం చేస్తానని చెప్పినా రైతు వినలేదు. దీంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో  ఆఫీస్ వద్దకు వచ్చి పత్రు కుటుంబసభ్యులకు నచ్చజెప్పి పంపించారు.

15 ఎకరాల భూమి రాసిచ్చినా కొడుకులు పట్టించుకుంటలేదు 

కొడుకుల పేరిట భూమిని పట్టా చేసి ఇచ్చినా తమను పట్టించుకోవడం లేదని గిన్నెల్ హెటీ గ్రామానికి చెందిన వృద్ధులైన మొర్లే పోషం దంపతులు కౌటాల తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. తనకు ఉన్న 15 ఎకరాల భూమిని ముగ్గురు కొడుకులు భగవంతం, భీం రావ్, నారాయణకు పట్టా చేసిన ఇచ్చానని, తమ చూసుకునేందుకు ఎవరూ ముందుకురావ డం లేదని వాపోయారు. 

వృద్ధ దంపతుల నలుగురు కూతుళ్లు వచ్చి తమ సోదరుల తీరు సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ పుష్పలత  కలెక్టర్ వద్దకు వెళ్లి  దరఖాస్తు ఇవ్వాలని వృద్ధ దంపతులకు సూచించారు. సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి వివరాలు నమోదు చేశారు.