సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం.. తడిసిన ధాన్యం

సిద్దిపేట, వెలుగు : జిల్లా వ్యాప్తంగా గురువారం ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా జిల్లాలోని పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. సిద్దిపేట, దుబ్బాక, మిరుదొడ్డి, తొగుటల్లోని మార్కెట్ యార్డుల్లో  ధాన్యం తడిసి పోవడంతో రైతులు  ఇబ్బందులు పడ్డారు. పలు యార్డుల్లో వరద నీటికి ధాన్యం కొట్టుక పోగా రైతులు వాటిని కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ మెదక్ రోడ్డుల్లో వర్షం నీరు రోడ్డు పై నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

దుబ్బాక మార్కెట్ యార్డులో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అమ్మకానికి తెచ్చిన దాన్యం అకాల వర్షంతో తడిసి వరద నీటిలో కొట్టుక పోతుంటే పలువురు రైతులు వర్షంలో తడుస్తూ వాటిని కుప్పల్లో పోసుకునే పరిస్థితి ఏర్పడింది. పలు చోట్ల వరద నీటికి విలువైన ధాన్యాన్ని రైతులు కొల్పొవాల్సిన పరిస్థితి ఏర్పడగా ఈదురు గాలలుతో కురిసన వర్షం వల్ల పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

అలాగే  రామాయంపేట, నిజాంపేట, కొల్చారం లో  కుండపోత వాన కురిసింది.   నందగోకుల్​ , కొల్చారం మండలంలోని చిన్న ఘనపూర్, సంగాయిపేట్ , రంగంపేట,  కోనాపూర్,  పైతర, తుక్కాపూర్ లో  ధాన్యం కుప్పలు తడిసిపోయాయి.