ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌‌‌‌లో .. తేమ ఎక్కువగా ఉందంటూ ధరలో కోత

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌‌‌‌లో సీసీఐ పత్తి కొనుగోళ్లు చేస్తున్నప్పటికీ తేమ కారణంగా రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. కేంద్రం ప్రారంభమైన శనివారం మొత్తం 47 మంది రైతులు 838 క్వింటాళ్ల పత్తిని అమ్మగా ఐదుగురికి మాత్రమే మద్దతు ధర రూ.7,521 దక్కింది. పత్తిలో తేమ 12 శాతానికి మించితే సీసీఐ కొనుగోలు చేయడం లేదు. దీంతో చేసేదేమీ లేక రైతులు ప్రైవేట్‌‌‌‌ వ్యాపారులను ఆశ్రయించారు. వారు తేమతో సంబంధం లేకుండా క్వింటాల్‌‌‌‌కు రూ. 6,840 చొప్పున చెల్లించి ఇప్పటికే 10 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు.

ప్రైవేట్‌‌‌‌ వ్యాపారులు కనీసం రూ. 7 వేలు చెల్లించినా తమకు గిట్టుబాటవుతుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. వ్యాపారులు సిండికేట్‌‌‌‌గా మారి ధరనునిర్ణయిస్తుండడంతో రైతులు భారీ మొత్తంలో నష్టపోతున్నారు. మొదటి సారి ఏరిన పత్తి పచ్చిగా ఉంటుందని, దీంతో తేమ శాతం 20కి మించుతుందని రైతులు అంటున్నారు. అయితే పత్తిలో తేమ 12 శాతం మించకుండా చూసుకోవాలని ఆఫీసర్లు చెబుతుండడంతో కొంత మంది రైతులు పత్తిని ఆరబెట్టుకుంటున్నారు. 

ఐదు నుంచి 10 రోజులు ఎండలో ఆరబెడితే తేమ శాతం తగ్గి, మద్దతు ధర వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ పత్తిని ఇన్ని రోజులు ఆరబెడితే రెండు క్వింటాళ్ల వరకు దిగిపోయే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. చాలా మంది రైతులు పంటను ఆరబెట్టుకోకుండానే తీసుకొస్తుండడంతో తేమ ఎక్కువగా ఉందంటూ సీసీఐ కొనుగోలు చేయడం లేదు.