- గంటపాటు మెదక్, సంగారెడ్డి మెయిన్ రోడ్డుపై బైఠాయింపు
కొల్చారం, వెలుగు : వడ్లు తూకం వేసినప్పటికీ రైస్ మిల్లులు ధాన్యం తరలించక పోవడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని సంగాయిపేట రైతులు మంగళవారం మెదక్ , సంగారెడ్డి మెయిన్ రోడ్డుపై వడ్ల సంచులతో బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. తూకం వేసి వారం నుంచి 15 రోజులు గడుస్తున్నా ధాన్యం మిల్లులకు తరలించడం లేదని, లారీల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పక్కనే నింపిన సంచులు ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోయారు.
ఎంత విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 50 శాతం వడ్లు తూకం వేసి అలాగే ఉంచారని రైస్ మిల్లుకు తరలించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. అలాగే సన్నరకం వడ్లు కొనుగోలు చేయడంలో అధికారులు మౌనం పాటిస్తున్నారని కల్లాలపైనే వడ్లు ఉన్నాయని వాటిని కూడా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘట నాస్థలానికి ఎస్ఐ మహ్మద్ గౌస్ చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రతి రోజు మూడు లారీలు ఏర్పాటు చేయిస్తానని హామీనివ్వడంతో రైతులు శాంతించారు. గంటన్నరపాటు ఆందోళనతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు ప్రభాకర్, రైతులు వెంకట్రాంరెడ్డి, రమేశ్, మల్లేశం, సాయిలు, సంగమేశ్వర్రెడ్డి, నవాజ్, సత్యం, శ్రీను, మల్లేశ్ పాల్గొన్నారు.