నర్సాపూర్, వెలుగు : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటలో సంగారెడ్డి కాల్వ రీచ్-2 సర్వే చేయడానికి వచ్చిన ఆఫీసర్లను బుధవారం రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే భూములు కోల్పోయామని సంగారెడ్డి కాల్వ రీచ్-2లో భూములు పోతున్న వారికి భూమికి బదులు భూమి ఇవ్వాలని లేదంటే ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తమకు న్యాయం జరిగే వరకూ సర్వే పనులు చేయరాదంటూ ఆఫీసర్ వచ్చే దారిలో అడ్డంగా కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆఫీసర్లు సర్వే చేయకుండానే వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో రైతులు వంటల నరసింహారెడ్డి, ప్యాట మహేశ్ గౌడ్, వజ పెంటయ్య, ఏంబరి అర్జున్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.