అధికారుల తప్పులు.. రైతులకు తిప్పలు

  • భూమి లేకున్నా పాస్ బుక్​లు జారీ
  • ట్రిపుల్​ఆర్​లో భూములు కోల్పోయే రైతులకు అన్యాయం

శివ్వంపేట, వెలుగు:  రెవెన్యూ అధికారుల తప్పుల వల్ల రైతులు తిప్పలు పడుతున్నారు. మండలంలోని పోతుల బొగుడ, కొంతన్ పల్లి తదితర  గ్రామాల పరిధిలో రెవెన్యూ రికార్డుల్లో ఉన్న దానికంటే దాదాపు 500 ఎకరాలకు పైగా భూమి ఎక్సెస్ ఉంది. భూమి లేకున్నా  ఆయా గ్రామాల్లో దాదాపు 300 ఎకరాలకు అధికారులు పాస్ బుక్​లు జారీ చేశారు. ఒక్క పోతుల బొగుడ గ్రామంలోనే భూమి లేకున్నా 100 ఎకరాలకు పాస్​ బుక్​ లు ఇచ్చారు. ఆ పాస్ బుక్ లు ఉన్న రైతులకు రైతుబంధు, రైతు బీమా వస్తుంది. ఇదిలా ఉండగా ఆయా గ్రామాల పరిధిలో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి సేకరించే భూములు సాగు చేస్తున్న  రైతుల సర్వే నంబర్లు మరోచోట చూపిస్తున్నాయి.

పోతుల బొగుడకు చెందిన 53 మంది రైతుల సాగులో ఉన్న భూములు ట్రిపుల్​ఆర్​రోడ్డు వెళ్లే ప్రాంతంలో ఉన్నాయి. కానీ వారి పాస్​బుక్ లలో ఉన్న సర్వే నంబర్లు అక్కడ కాకుండా మరో చోట ఉన్నాయి. దీంతో భూములు కోల్పోయే వారికి నష్ట పరిహారం అందని పరిస్థితి నెలకొంది. భూములు లేకున్నా జారీ అయిన పాస్​ బుక్​లలో ఉన్న సర్వే నెంబర్లు ట్రిపుల్​ఆర్​ పరిధిలో ఉన్నాయి. రెవెన్యూ అధికారులు రికార్డుల ప్రకారమే నష్ట పరిహారం చెల్లిస్తామని చెబుతుండడంతో అనర్హులు లబ్ది పొందే అవకాశం ఉంది.

తప్పులు సరిచేసి భూమి లేని వారికి జారీ చేసిన పాస్​ బుక్​లు రద్దు చేయాలని రెవెన్యూ అధికారులకు ఏండ్లుగా మొరపెట్టుకుంటున్నా ఫలితం లేదని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోగస్ ​పాస్​బుక్​లు రద్దు చేసి భూములు కోల్పోయే అసలైన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ పోతుల బొగుడ గ్రామ రైతులు ఇటీవల కలెక్టర్​ రాహుల్​ రాజ్​కు వినతి పత్రం సమర్పించారు.     

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు 500 ఎకరాలకు పైగా ఎక్సెస్ ల్యాండ్ ఉంది. అందులో 250 ఎకరాల వరకు పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి. అయితే భూమిలేని వారి పాస్ పుస్తకాలు రద్దు చేసే అధికారం మాకు లేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. 

శ్రీనివాస్​చారి, తహసీల్దార్, శివ్వంపేట

53 మంది రైతులకు నష్టం 

మా ఊరిలో భూమి లేని అనేక మంది రైతులకు పాస్ బుక్ లు ఇచ్చారు. మా తాత తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిలో నుంచి  ట్రిపుల్ ఆర్ పోతోంది. కానీ రికార్డు ప్రకారం మీ భూమి ఇక్కడ లేదని రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు. దీనివల్ల దాదాపు 50 ఎకరాలు కాస్తులో ఉన్న 53 మంది రైతులకు నష్టం జరుగనుంది.  

నర్సింలు, రైతు, పోతుల బొగుడ 

8 ‌‌ఎకరాలు ఎక్సెస్​

మా గ్రామంలో ఉన్న భూమి కన్నా రికార్డుల్లో దాదాపు 80 ఎకరాల భూమిని ఎక్సెస్ చేసి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు. వారికి రైతుబంధు, రైతు బీమా వస్తుంది.  భూమి ఎక్సెస్ ఉంది దానిని రికార్డు లో నుంచి తీసేయండి అని అధికారుల దగ్గరికి వెళితే డిలీట్ ఆప్షన్ మా పరిధిలో లేదన్నారు. అధికారుల తప్పు వల్ల ట్రిపుల్ ఆర్ భూసేకరణలో అసలైన రైతులకు అన్యాయం జరుగుతోంది.

హరికిషన్, మాజీ సర్పంచ్, పోతుల బొగుడ