భూములు ఇచ్చేదేలే .. జీవనాధారం కోల్పోతామని రైతుల ఆందోళన

  • వ్యవసాయ భూముల్లో ఫార్మా కంపెనీలొద్దు 
  • పర్యావరణానికి తీవ్ర ముప్పు

సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు: న్యాల్కల్ మండలంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై వివాదం ముసురుకుంటోంది. పంటలు పండించే భూముల్లో కాలుష్యాన్ని వెదజల్లే ఫ్యాక్టరీల ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు తమ భూములు ఇచ్చేదే లేదని తెగేసి చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలం డప్పుర్, వడ్డీ, మల్గి గ్రామాల శివార్లలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

దాదాపు 500 మంది రైతులకు సంబంధించిన 2003 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఇప్పటికే ఆందోళన ప్రారంభించారు. పంటపొలాల్లో ఫార్మా కంపెనీలు వద్దని.. తమ జీవనాధారమైన భూములు లాక్కోవద్దని వాపోతున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

మరో పటాన్ చెరుగా మారనుందా ?

పటాన్ చెరు నియోజకవర్గంలోని జిన్నారం, గుమ్మడిదల, పటాన్ చెరు మండలాల్లో అనేక పరిశ్రమలు నెలకొల్పారు. ఈ ఫ్యాక్టరీల పొల్యూషన్​ వల్ల అనేక గ్రామాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మూడు మండలాల్లో ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యజలాలు, రసాయనిక వ్యర్థాల వల్ల భూములు విషపూరితమై పంటలు పండే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు న్యాల్కల్ మండలంలో ఫార్మా కంపెనీలు వస్తే డప్పుర్, వడ్డీ, మల్గి గ్రామాల వ్యవసాయ భూములకు ప్రమాదమేనని స్థానిక రైతులు భయపడుతున్నారు. జహీరాబాద్ సమీపంలోని దిగ్వాల్ లో ఏర్పాటైన ఫార్మా కంపెనీల వల్ల అక్కడి భూములు విషపూరితమయ్యాయని వాపోతున్నారు. భూములు కోల్పోతే తాము ఉపాధిలేక రోడ్డున పడతామని ఆందోళన చెందుతున్నారు.

పర్యావరణంపై ఆందోళన

ఫార్మా కంపెనీల వల్ల గాలి, నీళ్లు కలుషితమై పర్యావరణం దెబ్బతింటుందని వర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని పటాన్ చెరు, హత్నూర, జిన్నారం, ఖాజిపల్లి ప్రాంతాల్లో ఫ్యాక్టరీల పొల్యూషన్ వల్ల స్థానికులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పటాన్ చెరు, హత్నూర ప్రాంతంలో చిన్న పిల్లలకే వెంట్రుకలు తెల్లబడడం, చిన్నవయస్సులోనే కీళ్ల నొప్పులు, నరాల బలహీనత వంటి సమస్యలు వస్తున్నాయి. తమకు ఇలాంటి పరిస్థితి రావద్దని భావిస్తున్న న్యాల్కల్ మండలంలోని డప్పుర్, వడ్డీ, మల్గి గ్రామస్తులు, రైతులు ఇప్పటికే తహసీల్దారు, ఆర్డీఓ ఆఫీస్ ల వద్ద ధర్నాలు చేశారు. కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణిలో అర్జీలు ఇచ్చారు. అయినా సరైన హామీ రాకపోవడంతో ఆందోళనల తీవ్రత పెంచేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు. అవసరమైతే కోర్టులను ఆశ్రయించాలని భావిస్తున్నారు. 

ALSO READ : టీచర్లను సర్దుబాటు చేస్తుండ్రు .. విద్యార్థులకు తీరనున్న కష్టాలు

వాతావరణాన్ని పాడుచేయకండి

పచ్చటి పొలాల్లో మందుల కంపెనీలు పెట్టి ఆగం చేయ్యొద్దు. కంపెనీల కోసం మా భూములు తీసుకోవడం న్యాయం కాదు. ఫార్మా కంపెనీలొస్తే పంటలు సరిగా పండవు. పంటలు పండక.. పనులులేక రోడ్డున పడతాం. 

బెగారి విట్టమ్మ, డప్పుర్, రైతు

ఆందోళన ఉధృతం చేస్తాం

ఫార్మా కంపెనీలు తీసుకొస్తే మా పోరాటం ఉధృతం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటును ఒప్పుకోం. అధికారులు ఇప్పటికైనా తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి. మా పల్లెలను కాపాడాలి.  

మొహమ్మద్ మదర్సాబ్, డప్పుర్ గ్రామం