- ప్రణాళికలు సిద్ధం చేసిన అగ్రికల్చర్ అధికారులు
- విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో రైతులు వానకాలం పంటలకు (ఖరీఫ్) సిద్ధమవుతున్నారు.ఈసారి జిల్లాలో 7.24 లక్షల ఎకరాల్లో పంటలు వేయనున్నారు. సాగుకు సంబంధించి అగ్రికల్చర్ అధికారులు ఇప్పటికే అంచనాలు తయారు చేశారు. ఏ పంటలు ఎంతవరకు సాగు చేస్తారు.. ఏ రకం విత్తనాలు, ఎరువులు అవసరమవుతాయనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో ప్రధానంగా రైతులు సింగూరు, నల్లవాగు, నారింజ ప్రాజెక్టులతోపాటు చెరువులు, కుంటలు బోరుబావులపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు. ప్రతీ ఏడాది ఎక్కువగా పత్తి, వరి పంటలను సాగు చేస్తుండగా వీటితోపాటు పెసర, కంది, మినుములు, సోయాబీన్ ఇతరత్రా పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈసారి తొలకరిలోనే వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో సాగుకు సమాయాత్తమవుతున్నారు.
7,24,405 ఎకరాల్లో..
జిల్లా వ్యాప్తంగా ఈసారి 7,24,405 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ అంచనా సిద్ధం చేసింది. పత్తి పంట 3.60 లక్షల ఎకరాల్లో అంచనా వేయగా, వరి 1.50 లక్షల ఎకరాలు, సోయాబీన్ 77,600 ఎకరాలు, కంది 79,500 ఎకరాలు, మొక్కజొన్న 14,200 ఎకరాలు, మినుములు 6,300 ఎకరాలు, పెసర్లు 9,800 ఎకరాలు, చెరుకు 25000 ఎకరాల్లో సాగు చేయనున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే గత ఏడాది జిల్లాలో అన్ని పంటలు కలిపి 7,17,529 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేయగా 7,11,548 ఎకరాల్లో పంటలు వేశారు. ఇందులో ప్రధానంగా పత్తి పంట 3,50,936 ఎకరాలకు గాను 3,48,946 ఎకరాల్లో సాగు చేయగా, వరి పంట 1,38,380 ఎకరాల అంచనాకు 1,34,934 ఎకరాల్లో సాగు చేశారు.
విత్తనాలకు యాక్షన్ ప్లాన్
జిల్లాలో పంటల సాగుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ అధికారులు యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. వరి విత్తనాలు 33,956 క్వింటాళ్లు, కంది విత్తనాలు 67,165 క్వింటాళ్లు, మొక్కజొన్న 10,985 క్వింటాళ్లు, పెసర్లు 7,020 క్వింటాళ్లు, సోయాబీన్ 59,095 క్వింటాళ్లు, మినుములు 4,455 క్వింటాళ్లు, పత్తి విత్తనాలు 7 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. గతేడాదిలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి సాగుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.