- పంటల సాగు అంచనా 3.73 లక్షల ఎకరాలు
మెదక్, వెలుగు: యాసంగి పంట నూర్పిళ్లు పూర్తికాగా రానున్న వానాకాలం సీజన్‌కు సంబంధించిన యాక్షన్ప్లాన్అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెడీ చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి 3,73,509 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా వరి 3,27,113 ఎకరాల్లో, ఆ తర్వాత పత్తి 40,619 ఎకరాల్లో సాగవుతుందని పేర్కొన్నారు.
2023 వానాకాలం సీజన్లో అన్ని రకాల పంటలు కలిపి 3,43,571 ఎకరాల్లో సాగు చేయగా, ఈ సారి పంటల సాగు విస్తీర్ణం పెరగనుంది. పంటల సాగు అంచనాలకు అనుగుణంగా వరి విత్తనాలు 78,500 క్వింటాళ్లు, పత్తి విత్తనాలు 238 క్వింటాళ్లు, కంది విత్తనాలు 123 క్వింటాళ్లు, మొక్కజొన్న విత్తనాలు 720 క్వింటాళ్లు, జొన్న విత్తనాలు 6 క్వింటాళ్లు, మినుము విత్తనాలు 53 క్వింటాళ్లు, పెసర విత్తనాలు145 క్వింటాళ్లు అవసరమవుతాయని అంచనా వేశారు. వీటితో పాటు ఎరువులు సమకూర్చేందుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏర్పాట్లు చేస్తోంది.
పచ్చిరొట్ట విత్తనాలు
భూసారం పెంచేందుకు ఉపకరించే పచ్చిరొట్ట విత్తనాలు 6,400 క్వింటాళ్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో జీలుగ విత్తనాలు 4,800 క్వింటాళ్లు, జనుము 1,600 క్వింటాళ్లు అవసరమవుతాయన్నారు. ఇప్పటి వరకు జీలుగ విత్తనాలు 4,080 క్వింటాళ్లు, జనుమ విత్తనాలు1,150 క్వింటాళ్లు జిల్లాకు చేరుకున్నాయని తెలిపారు.
ఎరువుల అవసరం ఇలా..
వానాకాలం సీజన్లో సాగు చేసే పంటలకు అన్ని రకాల ఎరువులు కలిపి మొత్తం 68,895 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశారు. ఇందులో యూరియా 29,500 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువు 28,000 మెట్రిక్ టన్నులు, డీఏపీ 4,015 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 3,780 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 3,600 మెట్రిక్ టన్నులు అవసరమని తెలిపారు. పంటల సాగుకు అనుగుణంగా జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు నెల వారీగా ఏఏ ఎరువులు ఎంత మొత్తం అవసరమనేది గుర్తించారు. తదనుగుణంగా రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
పొలాలు సిద్ధం చేస్తున్న రైతులు
యాసంగి పంట నూర్పిళ్లు పూర్తయి, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తరలించిన రైతులు వానాకాలం పంటల సాగుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. పశువుల ఎరువును పొలాలకు తరలిస్తున్నారు. బోరు వసతి ఉన్న వారు దుక్కులు దున్నుతున్నారు. పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు.