ఫారెస్ట్ ఆఫీసర్లు భయపెడుతున్నరు

  • టైగర్ జోన్ సర్వే పేరుతో మాకు అన్యాయం చేయొద్దు  
  • కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ కు మొరపెట్టుకున్న ఎనిమిది గ్రామాల ప్రజలు 

కాగజ్ నగర్, వెలుగు : టైగర్ జోన్ పేరుతో తమ భూములను సర్వేలు చేస్తూ, ఫొటోలు, వీడియోలు తీస్తూ ఫారెస్ట్ ఆఫీసర్లు భయాందోళనకు గురి చేస్తున్నారని రైతులు, గ్రామస్తులు కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు. సోమవారం కాగ జ్ నగర్ మండలం నందిగూడ, గొంది, నార్లపుర్, ఊటుపల్లి, రేగులగూడ, అంకుసాపూర్ గ్రామాలకు చెందిన వందమంది రైతులు, గ్రామస్తులు సబ్ కలెక్టరేట్ కు తరలివెళ్లడంతో ఆందోళనకు దిగడంతో  కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా గ్రామస్తుల వద్దకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామాలు అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్నాయని, తాతల నుంచి ఇక్కడే నివసిస్తూ భూములు సాగు చేస్తున్నామని, రెవెన్యూ పట్టాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కొద్ది రోజులుగా కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సిబ్బంది టైగర్ జోన్ సర్వే పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. పాస్ బుక్ లు, ఆధార్ కార్డులు తీసుకొని నమోదు చేసుకుంటున్నారని,  ఎందుకని అడిగితే ఫారెస్ట్ భూముల్లో ఉన్నారని ఆదేశాలు వచ్చాయని చెబుతుండగా  భయాందోళన చెందుతున్నామన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో టైగర్ జోన్ కు ఒప్పుకునేది లేదని, వెంటనే సర్వేను  ఆపేలా చూడాలని సబ్ కలెక్టర్ ను కోరారు.  ఇప్పటివరకు టైగర్ జోన్ పై ఎలాంటి సర్వే చేస్తున్నట్లు నోటీసు రాలేదని, దీనిపై జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్, కలెక్టర్ తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. తమకు అన్యాయం చేయొద్దని, లేదంటే ఆందోళన చేస్తామని రైతులు, గ్రామస్తులు హెచ్చరించారు.