నాడు బెస్ట్ పీహెచ్ సీ.. నేడు డాక్టర్లు లేని దుస్థితి

  • గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు
  • ఇప్పుడు కనీసం ట్రీట్​మెంట్ అందించలేని దైన్యం

కాగజ్ నగర్, వెలుగు: మారుమూల ప్రాంతాల్లో పేదలకు ఉత్తమ వైద్య సేవలందించిన పీహెచ్​సీ అది.. జాతీయస్థాయిలో వైద్యారోగ్య శాఖ క్వాలిటీ సేవలు అందిస్తున్న జాబితాలో పలుమార్లు చోటు దక్కించుకుందా ఆరోగ్య కేంద్రం. వందల సంఖ్యలో సాధారణ ప్రసవాలు చేసిన చరిత్ర. ఇంతటి ఘనత ఉన్న కౌటాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. నాడు 24 గంటలు పాటు సేవలందించిన పీహెచ్​సీ.. నేడు డాక్టర్లు లేక  కేవలం 8 గంటలు మాత్రమే పనిచేసే స్థాయికి పడిపోయింది. 

రెగ్యు లర్ డాక్టర్లు లేక ఇన్​చార్జీల పర్యవేక్షణలో అంతంత మాత్రంగానే వైద్య సేవలు అందుతున్నాయి. ఏడాది క్రితం వరకు అర్ధరాత్రి వచ్చినా డెలివరీ చేసేవారు. కానీ ఇప్పుడు సాయంత్రం 4 గంటల దాటితే కేంద్రానికి తాళం వేసి ఉంటోంది. ఏప్రిల్ తర్వాత ఇప్పటివరకు ఒక్క సాధారణ డెలివరీ జరగలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పనిచేస్తున్న ఏకైక స్టాఫ్ నర్స్ కూడా ఇటీవల బదిలీ కాగా ఏఎన్ఎంలే రోగులకు మందులు, సూదులు ఇస్తున్నారు. లోనవెల్లి పీహెచ్​సీ డాక్టర్ నవతను ఇన్​చార్జిగా నియమించగా ఆమెకు మరో రెండు పీహెచ్ సీల అదనపు బాధ్యతలు ఉన్నాయి. ఇప్పటికైనా కలెక్టర్, వైద్యాధికారులు స్పందించి మారుమూల ప్రాంతంలోని ఈ పీహెచ్​సీలో మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.