- ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేస్తామంటూ పెట్రోల్ బంక్‌లో నగదు తీసుకుంటున్న నిందితులు
- నకిలీ ఫోన్‌పే యాప్ ద్వారా డబ్బులు పంపినట్లు మెసేజ్ చూపి పరార్
నిర్మల్, వెలుగు : ఆన్‌లైన్ పేమెంట్ల పేరుతో మోసం చేస్తున్న నలుగురు వ్యక్తులను నిర్మల్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ గంగారెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్‌కు చెందిన జమ్ముల భరత్‌తో పాటు అతడి ఫ్రెండ్స్ ధరమ్‌సోత్ సాయికిరణ్, రాథోడ్ అరుణ్, రాథోడ్ జీవన్ గత నెల 28న నిర్మల్‌లోని కావేరి పెట్రోల్ బంక్‌కు వచ్చారు. తమ బంధువు హాస్పిటల్‌లో ఉన్నాడని, అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని తమకు రూ. 8 వేలు నగదు ఇస్తే ఫోన్ పే చేస్తామంటూ బంక్ సిబ్బందిని నమ్మించారు.
తర్వాత నకిలీ యాప్‌తో ఫోన్‌పే చేసినట్లు చూపించి డబ్బులు తీసుకొని వెళ్లిపోయారు. అలాగే ఈ నెల 2న నిర్మల్‌లోని పోలీస్ పెట్రోల్ బంక్‌కు వచ్చి అత్యవసరంగా రూ. 8 వేలు అవసరం ఉన్నాయని, నగదు ఇస్తే ఫోన్ పే చేస్తామంటూ బంక్ సిబ్బందిని నమ్మించి డబ్బులు తీసుకొని వెళ్లిపోయారు. అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ కాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గురువారం పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని పోలీసులు గమనించి అదుపులోకి తీసుకొని విచారించగా ఆన్‌లైన్ పేమెంట్ల పేరుతో మోసాలు చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి బైక్, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ గంగారెడ్డి చెప్పారు. టౌన్ సీఐ నవీన్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.