వాంకిడి ఫుడ్ పాయిజన్ బాధితురాలు మృతి

  • నిమ్స్​లో చికిత్స పొందుతూ శైలజ కన్నుమూత
  • 25 రోజుల పాటు మృత్యువుతో పోరాటం
  • స్టూడెంట్ ను బతికించడానికి తీవ్రంగాయత్నించిన డాక్టర్లు
  • కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారుల హామీ

ఆసిఫాబాద్/పంజాగుట్ట, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లా వాంకిడి బాలికల ఆశ్రమ పాఠశాలలో గత నెల 31న ఫుడ్ పాయిజన్  జరిగి తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థిని శైలజ (14) చనిపోయింది. హైదరాబాద్  నిమ్స్ లో చికిత్స తీసుకుంటూ సోమవారం ఆమె కన్నుమూసింది. అక్టోబరు 31న ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్  జరిగి సుమారు 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధితులను ఆసిఫాబాద్  జిల్లా ఆసుపత్రికి తరలించారు. 

వారిలో పరిస్థితి తీవ్రంగా ఉన్న శైలజ, మహాలక్ష్మి, జ్యోతికను మంచిర్యాలలోని ప్రైవేట్  హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. శైలజ ఆరోగ్యం విషమంగా మారడంతో అక్కడే వెంటిలేషన్ పై చికిత్స అందించారు. పరిస్థితి మరింత విషమించడంతో బాధితురాలిని ఈనెల 11న హైదరాబాద్  నిమ్స్ కు తరలించారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని చికిత్స అందించినా లాభం లేకపోయింది. 

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క బాధితురాలిని పరామర్శించి మెరుగైన వైద్యం అందేలా కృషి చేశారు. ఆమెను బతికించడానికి డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు. 25 రోజుల పాటు మృత్యువుతో పోరాడి సోమవారం పరిస్థితి మరింత విషమించడంతో శైలజ ప్రాణాలు కోల్పోయింది. 

పాఠశాలలో విషాద ఛాయలు

శైలజ చనిపోయిన వార్త తెలిసి వాంకిడి బాలికల ఆశ్రమ పాఠశాలలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. ఆమె మృతి వార్త తెలుసుకుని తోటి స్టూడెండ్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా.. శైలజది కుమ్రం భీం ఆసిఫాబాద్  జిల్లాలోని ధాభా గ్రామం. ఆమె తల్లిదండ్రులు తుకారాం, మీరాబాయి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి శైలజతో పాటు ఓ కొడుకు ఉన్నాడు. కూతురు మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయిది. స్టూడెంట్  మృతితో మాలి సంఘం నాయకులు, స్టూడెంట్  యూనియన్లు ఆందోళన చేసే అవకాశం ఉందని సమాచారం రావడంతో పోలీసులు అలర్ట్  అయ్యారు . వాంకిడిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ పొలీస్ స్టేషన్ల నుంచి ఎస్ఐలు, సిబ్బందిని మోహరించారు.

స్టూడెంట్ కుటుంబానికి అండగా ఉంటాం: అధికారులు

ఫుడ్ పాయిజన్ కు గురై మృతి చెందిన శైలజ కుటుంబాన్ని ఆదుకుంటామని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి హామీ ఇచ్చారు. శైలజకు మెరుగైన వైద్యం అందించామని, అయినా ఆమె చనిపోవడం కలచివేసిందని చెప్పారు. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఐటీడీఏ పీఓ చెప్పారని ఆమె తెలిపారు.