పైసలిస్తరా.. వేలానికి పర్మిషన్​ ఇస్తరా?

  • బిలులు రాలేదని కథ్​గాం మాజీ సర్పంచ్ ​ఆవేదన
  • గ్రామ పంచాయతీ భవనం, ట్రాక్టర్ల వేలానికి అనుమతివ్వాలని వినతులు
  • సోషల్​ మీడియాలో వైరలవుతున్న వినతిపత్రం

భైంసా, వెలుగు: అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టానని, కానీ ఆ పనులకు నిధులు మంజూరు కాలేదని, త్వరగా బిల్లులైనా మంజూరు చేయాలని లేదంటే గ్రామ పంచాయతీ భవనాన్ని వేలం వేసేందుకు పర్మిషన్​అయినా ఇవ్వాలని  భైంసా మండలం కథ్​గాం గ్రామ మాజీ సర్పంచ్ ​అధికారులను వేడుకుంటున్నాడు. ‘నేను ఐదేండ్లపాటు పదవిలో ఉండి మా గ్రామ పంచాయతీలో దాదాపు రూ. కోటిన్నర వరకు అభివృద్ధి పనులు చేపట్టా. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, జీపీ బిల్డింగ్​ నిర్మాణాలకు రూ. 60 లక్షల వరకు ఖర్చు చేశా. ఇందుకోసం అప్పులు చేశా. 

బిల్లులు పెండింగ్​లో ఉండడంతో అప్పులు తీర్చలేక రెండేండ్లుగా వడ్డీలు కడుతున్నా. ఆర్థికంగా బాగా ఇబ్బం దుల్లో ఉన్నా.. త్వరగా బిల్లులు ఇవ్వండి.. లేదంటే జీపీ భవనం, ట్రాక్టర్లను వేలం వేయాలనుకుంటున్నాం. నాకు పర్మిషన్​ ఇవ్వండి’ అంటూ మాజీ సర్పంచ్ ​రాజు అధికారులకు మొరపెట్టుకుంటున్నాడు. ఇందుకు సంబంధించి వినతిపత్రాలను ముథోల్​ఎమ్మెల్యే రామారావు పటేల్, అడిషనల్​కలెక్టర్​ ఫైజాన్​ అహ్మద్, ఆర్డీవో కోమల్​రెడ్డి, తహసీల్దార్​ ప్రవీణ్​కు వేర్వేరుగా ఇటీవల అందజేశారు. ఈ లెటర్ ​సోషల్ ​మీడియాలో వైరల్​గా మారింది. 

కథ్​​గాం గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసి జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని.. కానీ రూ.60 లక్షల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయన్నారు. వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని అన్నారు. మూడ్రోజుల్లో అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే గ్రామ పంచాయతీ భవనం ట్రాక్టర్​ను వేలం పాట వేసేందుకు పర్మిషన్​ఇవ్వాలని కోరారు.