పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలు

మెదక్‌‌, వెలుగు: లోక్​ సభ ఎన్నికలకు సంబంధించి మెదక్  లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల    ఈవీఎంలను పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్​ రూమ్​లో భద్రపరిచినట్టు జిల్లా ఎన్నికల అధికారి,య  మెదక్ కలెక్టర్  రాహుల్ రాజ్ తెలిపారు. సీసీ టీవీ కెమెరాల నిఘామధ్య, కేంద్ర ప్రభుత్వ సాయుధ దళాల పహారాలో భద్రపరుస్తున్నామన్నారు. గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను బీవీఆర్​ఐటీ ఇంజనీరింగ్  కాలేజీలో, సంగారెడ్డి , పటాన్​ చెరు అసెంబ్లీ సెగ్మెంట్​ల ఈవీఎంలను ప్రభుత్వ గిరిజన బాలుర జూనియర్ కళాశాలలో భద్రపరిచామని తెలిపారు. 

మంగళవారం జనరల్ అబ్జర్వర్​ సమీర్ మాధవ్ కుర్కోటి  సమక్షంలో సంబంధిత అసెంబ్లీ సెగ్మెంట్​ల ఏఆర్వోలు, రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను  స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి సీల్ వేసినట్టు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్​కు, ఎన్నికలకు సంబంధించిన స్క్రూటినీ రిపోర్ట్ లు, స్టాట్యూటరీ రిపోర్ట్ లకు అభ్జర్వర్​ సమక్షంలో సీల్ వేశామని వివరించారు.  ఎలక్షన్ పేపర్ స్ట్రాంగ్ రూం ను ఓపెన్ చేసి అబ్జర్వర్,  అభ్యర్థుల తరపున వచ్చిన ప్రజా ప్రతినిధుల సమక్షంలో స్క్రూటినీ చేయడం జరిగిందని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ లలో అతి ఎక్కువ, అతి తక్కువ పోలింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలను,  రీప్లేస్మెంట్ జరిగిన బూత్ లు వంటి వాటిని స్క్రూటిని చేసి పరిశీలించడం జరిగిందని తెలిపారు. 

అన్ని అంశాల్లో కూడా ఏలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సాఫీగా, విజయవంతం గా జరిగాయని నిర్ధారణకు రావడం జరిగిందన్నారు. అన్ని గణాంకాలు సరిపోవడంతో ఎక్కడ కూడా రీపోలింగ్ కు అవకాశం లేదని కలెక్టర్​ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట అడిషనల్​  కలెక్టర్ గరిమ అగర్వాల్, మెదక్​ జిల్లా ఎస్పీ బాలస్వామి, అడిషనల్​  కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆయా అసెంబ్లీ సెగ్మెంట్​ల ఏఆర్వోలు, డీఎస్పీలు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.