- జహీరాబాద్ లోక్ సభ బరిలో19 మంది అభ్యర్థులు
- కౌంటింగ్ కోసం మొత్తం14 టేబుళ్లు,145 రౌండ్లు
- స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత
సంగారెడ్డి, వెలుగు: జహీరాబాద్ లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ క్రాంతి కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేయించారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి మే 13న ఎన్నికలు నిర్వహించగా, 12,25,049 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తరించి ఉన్న జహీరాబాద్ లోక్ సభ బరిలో మొత్తం19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ పెరగడంతో ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ షురువైంది.
14 టేబుళ్లు, 145 రౌండ్లు..
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 4న జరగనుంది. కౌంటింగ్ రోజు ఉదయం 5 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేస్తారు. పోలింగ్ ఏజెంట్లు ఉదయం 6 గంటలకు కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. కౌంటింగ్ కోసం మొత్తం14 టేబుళ్లు, 145 రౌండ్లు కొనసాగుతాయి. కౌంటింగ్ సూపర్ వైజర్లు 153 మంది, సహాయకులు 173 మంది కలిపి మొత్తం 326 మంది కౌంటింగ్ లో పాల్గొంటారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కాగా మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలను కౌంటింగ్ చేస్తారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు మినహా ఇతరులను ఎవ్వరినీ కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ లను అనుమతించడం లేదు. తుది ఫలితాల వెల్లడి తర్వాత కౌంటింగ్ సెంటర్ వద్ద ఆంక్షలు పక్కాగా అమలయ్యేలా రిటర్నింగ్ అధికారి ముందస్తు చర్యలు చేపట్టారు.
అభ్యర్థుల్లో టెన్షన్
ఫలితాల తేదీ దగ్గర పడడంతో అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ లోపల ఓటమి భయం వారిని వెంటాడుతోంది. ఎన్నికలకు వారం రోజుల ముందు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉన్నట్టు కనిపించినా ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అయిష్టంగానే బరిలోకి దిగినప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో ప్రచారం, పోల్ మేనేజ్ మెంట్లో వెనుకబడిపోయారన్న ప్రచారం జరుగుతోంది.
దీంతో జహీరాబాద్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సెకండ్ క్యాడర్ లీడర్లు, కార్యకర్తలు అంతగా ఆసక్తి చూపించలేకపోయారని సొంత పార్టీ నాయకులు చెబుతున్నారు. పోలింగ్ కు రెండు రోజుల ముందు నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు అనుకూలంగా వ్యవహరించారన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఏదేమైనాప్పటికీ మొత్తంమీద జహీరాబాద్ పార్లమెంట్ ఫలితాలు అభ్యర్థుల రాజకీయ భవిష్యత్‌ను మార్చబోతున్నాయి.