అంతా గ్యాస్, ట్రాష్.. బడ్జెట్​పై కేసీఆర్​ కామెంట్స్​

  • ఈస్ట్​మన్​ కలర్​లో చూపెట్టిన్రు 
  • ఇది అర్భక, రైతు శత్రు ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్​ అంతా గ్యాస్​, ట్రాష్​ తప్ప మరేం లేదని బీఆర్​ఎస్​ చీఫ్​, మాజీ సీఎం కేసీఆర్​ విమర్శించారు. ‘‘ఏ ఒక్క ఒక పాలసీ ఫార్ములేషన్​ లేదు.. పారిశ్రామిక పాలసీ, ఐటీ పాలసీ, వ్యవసాయ పాలసీ అంటూ ఏమీ లేదు. ఇది అర్భక ప్రభుత్వం. ఈస్ట్​మన్​కలర్​లో అంతా చూపించింది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేం చీల్చిచెండాడుతం” అని వ్యాఖ్యానించారు. 

అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో గురువారం అసెంబ్లీకి కేసీఆర్​ వచ్చారు. రాష్ట్ర బడ్జెట్​పై అసెంబ్లీ మీడియా పాయింట్​లో ఆయన మాట్లాడారు. మీడియా పాయింట్​కు కేసీఆర్​ వచ్చి మాట్లాడటం కూడా ఇదే మొదటిసారి. ‘‘ఇది పూర్తి రైతు శత్రు ప్రభుత్వం.. ధాన్యం కొనుగోలు చేయడం లేదు.. విద్యుత్ సరఫరా చేయడం లేదు.. నీటి సరఫరా చేయడం లేదు.. రైతులను చాలా ఇబ్బందిపెడ్తున్నది. 

ఆర్థిక మంత్రి చేసిన ప్రసంగంలో ఒత్తొత్తి చెప్పడం, ఒత్తొత్తి పలకడం తప్ప మరేం కనిపించలేదు. చిల్లర మల్లర ప్లాట్​ఫామ్​ స్పీచ్​లా ఉంది. రాజకీయ సభలలో చెప్పినట్లు ఉంది” అని ఆయన దుయ్యబట్టారు. బడ్జెట్లో ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం అంటూ లేదన్నారు. ‘‘మహిళ సంక్షేమం కోసం చెప్పాల్సి ఉండే. వారికి లక్ష కోట్ల రుణాలను ఇస్తున్నట్టు పాత పథకాన్ని మళ్లీ తామేదో జేబులోంచి ఇస్తున్నట్టు ప్రకటించిన్రు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడి తర్వాత కనీసం ఆరు మాసాల సమయం ఇవ్వాలని అనుకున్నాం. నేను కూడా ఇన్నిరోజులు అసెంబ్లీకి రాలేదు. సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్​ను చూసిన తర్వాత ఇక చీల్చచెండాడుతం” అని హెచ్చరించారు.  

అంతా స్టోరీ టెల్లింగ్​లా ఉంది

రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి స్థిరీకరణ జరగాలని తమ ప్రభుత్వ హయాంలో రెండు పంటలకు రైతు బంధు ఇచ్చామని,  ఇప్పుడేమో ఎగ్గొడతామంటున్నారని కేసీఆర్​ దుయ్యబట్టారు. ‘‘ఈ బడ్జెట్​ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినట్లు ఉంది. రాష్ట్ర రైతులను పొగుడుతున్నట్లే పొగుడుతూ వెన్నుపోటు పొడిచిందీ ప్రభుత్వం. రైతుబంధులో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్లు చెప్తున్నరు. 

గత మా ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమాన్ని, ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక్క పథకం మీద కూడా స్పష్టత లేదు. మేం రైతులకు ఇచ్చిన డబ్బులను పాడు చేశామని, చెడగొట్టామని, దుర్వినియోగం చేశామన్నరీతిలో కాంగ్రెస్​ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నరు. ఈ ప్రభుత్వం రైతులనే కాకుండా వృత్తి కార్మికులను కూడా వంచించింది. యాదవులకు గొర్రెల పథకం లేదు. 

మత్స్యకారులను పక్కనపెట్టారు” అని అన్నారు. దళిత వర్గాల కోసం తాము ప్రవేశపెట్టిన దళితబంధు పథకం గురించి బడ్జెట్​లో ప్రస్తావన కూడా లేదని, దళిత సమాజం పట్ల వీళ్లకున్న ఫ్యూడల్​ విధానానికి ఇదే నిదర్శనమని కేసీఆర్​ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్​లో  ఎవరికీ భరోసా లేదని పేర్కొన్నారు. ‘‘బడ్జెట్​ ప్రసంగం అంతా స్టోరీ టెల్లింగ్​లా ఉంది. పేదలకు సంబంధించి పాలసీ అంటూ ఏదీ ఈ ప్రభుత్వానికి లేదు. 

ఏ ఒక్కపాలసీ గురించి నిర్ధిష్టంగా ఫలానా పని చేస్తామన్నది కూడా చెప్పలేదు. ఇది పేదల బడ్జెట్​ కాదు.. రైతుల బడ్జెట్​ కాదు.. ఎవరి బడ్జెటో విశ్లేషణలో తేలుస్తం. భవిష్యత్తులో బ్రహ్మాండంగా చీల్చిచెండాడుతం” అని అన్నారు.  ఆర్థిక మంత్రివి ఒత్తొత్తి పలుకులుచిల్లర మల్లర ప్లాట్​ఫామ్​ స్పీచ్​లా ఉంది ఒక్క పాలసీ ఫార్ములేషన్​ అన్నదీ లేదుప్రభుత్వానికి టైమివ్వాలని నేను కూడా ఇన్నాళ్లూ అసెంబ్లీకి రాలే.. భవిష్యత్తులో బ్రహ్మాండంగా చీల్చి చెండాడుతానని హెచ్చరికప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి.. మీడియా పాయింట్​లో ప్రసంగించారు.