- 90 శాతం దివ్యాంగుడైనా అందని ప్రభుత్వ సాయం
- ఆదుకోవాలని వేడుకుంటున్న బాధితుడు
కుభీర్, వెలుగు : తాను 90 శాతం దివ్యాంగుడినైనా పెన్షన్ రావడం లేదని, తనకు న్యాయం చేయాలని ఓ బాధితుడు కోరుతున్నాడు. గ్రామానికి వచ్చిన ప్రజా ప్రతినిధులు, అధికారులను వేడుకుంటున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదుని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సాంగ్వి గ్రామానికి చెందిన విఠల్ (32) పుట్టుక తోనే దివ్యాంగుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం ద్వారా రూ.200 పెన్షన్ పొందేవాడు. తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం విఠల్ కు పెన్షన్ మంజూరు చేయలేదు.
సదరం క్యాంప్ సర్టిఫికెట్లో 90 శాతం పర్సంటేజీ ఉన్నప్పటికీ పెన్షన్ మాత్రం ఇవ్వలేదు. దివ్యాంగుడి కోటాలో కేంద్ర ప్రభుత్వం వీల్ చైర్ సైకిల్ సైతం అందించింది. నిరుపేదలైన విఠల్ తల్లిదండ్రులు రోజూ కూలీ పనులు చేస్తూ అతడిని పోషిస్తున్నారు. తన సమస్యను ఎవరికి చెప్పినా పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా అధికా రులు స్పందించి దీనస్థితిలో తనకు పెన్షన్ మంజూరు చేయాలని బాధితుడు కోరుతున్నాడు.