దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా కస్టమర్లకు షాకిచ్చింది.. కార్ల ధరలు పెంచుతున్నట్లు శుక్రవారం (డిసెంబర్ 6) ప్రకటించింది. అన్ని రకాల మారుతి కార్ల ధరలు 4శాతం పెంచుతున్నట్లు ఎనౌన్స్ చేసింది కంపెనీ.. పెరిగిన ధరలు జనవరి 2025 నుంచి అమలులోకి రానున్నాయి.
పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల వల్ల మారుతీ కార్ల ధరలను పెంచనుంది. అయితే మోడల్ వారీగా ధరల పెంపును కంపెనీ పేర్కొనలేదు. సాధారణంగా కార్ల తయారీదారులు (OEMలు) ప్రతి యేటా రెండుసార్లు కార్ల ధరలను పెంచుతారు.
మారుతి సుజుకీ అన్ని రకాల కార్లను నెక్సా, ఎరీనా అవుట్ లెట్ల ద్వారా దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది. Nexa అవుట్‌లెట్లు Ignis, Baleno, Ciaz, Fronx, Grand Vitara, Jimny, XL6 , Invicto వంటి మోడల్స్ ను అందిస్తాయి. ఎరీనా అవుట్‌లెట్ల ద్వారా ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, సెలియో, ఈకో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా ,ఎర్టిగా మోడల్స్ ను విక్రయిస్తోంది.
మరోవైపు మారుతికి ప్రత్యర్థి అయిన కార్ల కంపెనీ హ్యుందాయ్ కూడా కార్లను ధరలను జనవరి నుంచి పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దాదాపు అన్ని అన్ని రకాల ఉత్పత్తులపై రూ. 25వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
అదేవిధంగా నిస్సాన్ మోటార్ ఇండియా కూడా జనవరి 2025 నుంచి మాగ్నెట్ ధరలను 2శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు అయిన మెర్సిడెస్-బెంజ్, BMW, ఆడి లు తమ కార్ల ధరలను జనవరి 2025లో 3శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి.