HMPV వైరస్ దెబ్బకు స్టాక్ మార్కెట్ ఢమాల్..రెండు ఇండెక్స్లూ డీలా పడ్డాయి

 

  • మార్కెట్​లో వైరస్​ భయాలు
  • సెన్సెక్స్​ 1,250 పాయింట్లు డౌన్​
  • 388 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • రూ.10.98 లక్షల కోట్లు ఆవిరి
  • 1.62 శాతం నష్టపోయిన నిఫ్టీ

న్యూఢిల్లీ:ఈక్విటీ మార్కెట్లు సోమవారం ఘోరంగా దెబ్బతిన్నాయి.సెన్సెక్స్​, నిఫ్టీ ఒకటిన్నర శాతానికిపైగా నష్టపోయాయి. హెచ్​ఎంపీవీ వైరస్ ​ఇండియాలోకి వచ్చిం దన్న వార్తలతో రెండు ఇండెక్స్​లూ కుదేలయ్యాయి. దీనికితోడు అమ్మకాల ఒత్తిడి, మూడో క్వార్టర్​ఫలితాలపై ఆందోళన, విదేశీ నిధుల ఔట్​ఫ్లో కొనసాగుతూనే ఉండటంతో మార్కెట్​ సెంటిమెంట్​ దెబ్బతింది. 

సెన్సెక్స్​ 1,258.12 పాయింట్లు (1.59 శాతం) నష్టపోయి 77,964.99 పాయింట్ల వద్ద ఆగింది. ఇంట్రాడేలో   1,444.19 పాయింట్లు పడి 77,781.62 వద్ద స్థిరపడింది. బీఎస్​ఈలో 3,474 స్టాక్స్​ నష్టపోగా, 656 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 388.70 పాయింట్లు (1.62 శాతం) నష్టపోయి 23,616.05 పాయింట్లు వద్ద సెటిలయింది.   ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.10.98 లక్షల కోట్లు తగ్గింది. 

బీఎస్ఈ లిస్టెడ్​కంపెనీల మార్కెట్​క్యాప్​ రూ.4,38,79,406.58  కోట్లకు పడిపోయింది.  సెన్సెక్స్​ ప్యాక్​ నుంచి టాటా స్టీల్​, ఎన్టీపీసీ, కోటక్​మహీంద్రా బ్యాంక్​, ఇండస్​ ఇండ్ ​బ్యాంక్​, పవర్​గ్రిడ్​, జొమాటో, అదానీ పోర్ట్స్​, ఆసియన్​ పెయింట్స్​, మహీంద్రా అండ్​ మహీంద్రా, రిలయన్స్​ఎక్కువగా నష్టపోయాయి. టైటాన్​, సన్​ఫార్మా మాత్రమే లాభపడ్డాయి. బీఎస్​ఈ స్మాల్​క్యాప్​3.17 శాతం, మిడ్​క్యాప్​2.44 శాతం పడిపోయాయి. బీఎస్​ఈ సెక్టోరల్ ​ఇండెక్సెస్​లన్నీ నష్టపోయాయి. 

అమ్మకాల ఒత్తిడి...

హెచ్​ఎంపీ వైరస్​  ఔట్​బ్రేక్​తో పాటు బ్యాంకింగ్​ స్టాక్స్​లో అమ్మకాల ఒత్తిడి, మూడో క్వార్టర్​ ఫలితాలు నిరాశ పరుస్తాయనే అంచనాలతో మార్కెట్లు నష్టపోయాయని మోతీలాల్​ ఓస్వాల్​ ఫైనాన్షియల్​ సర్వీసెస్​ ఎనలిస్ట్​ సిద్ధార్థ ఖేమ్కా చెప్పారు. మిడ్​క్యాప్​, స్మాల్​క్యాప్​ ఇండెక్స్​లు 2–3 శాతం వరకు నష్టపోయాయని వివరించారు. ఫారిన్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లు శుక్రవారం రూ.4,227.25 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. 

ఆసియా మార్కెట్లో సియోల్ ​లాభపడగా, టోక్యో, షాంఘై, హాంగ్​కాంగ్​నష్టపోయాయి. యూరప్​మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం సానుకూలంగా ముగిశాయి.  బ్రెంట్​క్రూడ్​ధర 0.25 శాతం తగ్గి 76.32 డాలర్లకు చేరింది. డాలర్​తో రూపాయి మారకం విలువ 11 పైసలు తగ్గి 85.68  వద్ద ముగిసింది.