కొమురవెల్లిలో మల్లన్న ఆలయ ఉద్యోగుల లొల్లి

  • ఈవో ముందే కుర్చీలు లేపి కొట్టుకోబోయిన ఏఈవో, ఏఈ
  • అడ్డుకున్న తోటి ఉద్యోగులు

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయ ఉద్యోగులు ఆదివారం ఈఓ సమక్షంలో బాహాబాహీకి దిగారు. ఆలయంలో జరుగుతున్న కొన్ని విషయాలు బయటకు పొక్కడానికి నువ్వు కారణమంటే నువ్వే కారణమంటూ ఆరోపించుకోవడమే కాకుండా బూతులు తిట్టుకుంటూ కుర్చీలతో కొట్టుకోబోయారు. గుడిలో వివాదాలు,  కమిషనర్ ​ఆఫీసుకు వెళ్లిన ఫిర్యాదులతో ఆలయ ప్రతిష్టకు భంగం కలుగుతోందంటూ ఈవో బాలాజీశర్మ ఆదివారం తన ఆఫీసులో ఏఈవో గంగా శ్రీనివాస్, ఏఈ బి.అంజయ్యతో పాటు మరికొందరు ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆలయంలో అంతర్గత విషయాలను బయటకు తెలియనివ్వకుండా,  ఫిర్యాదులు చేసుకోకుండా ఎవరి డ్యూటీలు వారు సక్రమంగా చేసుకోవాలని ఈవో సూచించారు. ఈ సందర్భంగా ఏఈవో గంగా శ్రీనివాస్, ఏఈ బి.అంజయ్య మధ్య మాటామాటా పెరిగి వాదులాడుకున్నారు. ఒక దశలో బాహాబాహీకి దిగి కుర్చీలు లేపి విసిరేసుకోబోయారు. ఈ క్రమంలో ఏఈవో శ్రీనివాస్​, ప్లంబర్ ​విజయ్​ఏఈపై చేయి చేసుకున్నట్టు తెలిసింది. అక్కడే ఉన్న మిగతా ఉద్యోగులు అడ్డుకుని వారికి సర్ధి చెప్పారు. ఈవో బాలాజీశర్మ వారిని మందలించడంతో గొడవ సద్దుమణిగింది.

తర్వాత ఏఈవో గంగా శ్రీనివాస్, ప్లంబర్ విజయ్ ఏఈ అంజయ్యకు క్షమాపణ చెప్పి బయటకు వెళ్లిపోయారు. దీనిపై ఈవో బాలాజీ శర్మ వివరణ  కోరగా ఆలయానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తుండగా ఏఈవో శ్రీనివాస్, ఏఈ అంజయ్య గొడవ పడ్డ విషయం వాస్తవమేనన్నారు. సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలని చెప్పడంతో గొడవ సద్దుమణిగిందన్నారు.