ఓట్ల జాతర.. ప్రారంభమైన నామినేషన్లు

  • మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్ గిరిలో డీకే అరుణ, రఘునందన్, ఈటల దాఖలు

  • నాగర్ కర్నూల్ లో మల్లురవి నామినేషన్

  • నిజామాబాద్, ఆదిలాబాద్, భువనగిరిలో ఇండిపెండెంట్లు

  •  3 గంటల వరకు స్వీకరించిన్న ఆర్వోలు

  •  రిటర్నింగ్ ఆఫీసుల వద్ద సందడి

హైదరాబాద్: రాష్ట్రంలో ఓట్ల జాతర మొదలైంది. 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ( ఏప్రిల్​ 19) కేంద్ర ఎన్నికల కమిషన్  నోటిఫికేషన్ జారీ చేయడంతో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. పది రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు ఇవాళ ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీల ఎన్నికలకూ ఈసీ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇవాళ( ఏప్రిల్​ 19)  ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 రిటర్నింగ్ కార్యాలయాల్లో నామినేషన్లు మొదలయ్యాయి.

 మహబూబ్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, మల్కాజ్ గిరి నుంచి ఈటల రాజేందర్, మెదక్ నుంచి రఘునందన్ రావు, నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ వేశారు. భువనగిరి పార్లమెంట్ స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు, నిజామాబాద్ లో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి  సత్యనారాయణ నామినేషన్లు వేశారు. ఆదిలాబాద్  నుంచి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థిగా రాథోడ్ సుభాష్, ఆధార్ పార్టీ అభ్యర్థి శ్యామ్ లాల్ నాయక్ నామినేషన్ వేశారు.