స్కూల్ నుంచి వస్తుంటే.. అడ్డగించి.. ఇంట్లోకి లాక్కెళ్లి బాలికపై అత్యాచారం

స్కూల్‌‌‌‌ నుంచి ఇంటికి వెళ్తుండగా అఘాయిత్యం 
నిందితుడిని ఉరి తీయాలని స్టూడెంట్స్, గ్రామస్తుల ధర్నా 
ఆసిఫాబాద్​ జిల్లాలో ఘటన

ఆసిఫాబాద్, వెలుగు: స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బాలికను ఆటో డ్రైవర్‌ అత్యాచారం చేశాడు. ఆసిఫాబాద్‌ జిల్లా బూరుగడ్డ గ్రామానికి చెందిన ఓ బాలిక గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. శుక్రవారం సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి వస్తున్న బాలికను అదే గ్రామానికి చెందిన బొమ్మెన సాగర్‌ అనే ఆటో డ్రైవర్‌ అడ్డగించి, తన ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడి నుంచి విడిపించుకున్న బాలిక.. ఏడుస్తూ ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది.

 వెంటనే వారు పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామానికి చేరుకున్న పోలీసులు సాగర్‌‌ను అతని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, శనివారం రిమాండ్‌కు తరలించారు. మరోవైపు, నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు నేషనల్‌ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. 

నిందితుడికి ఉరిశిక్ష వేస్తేనే ఆందోళన విరమిస్తామని పట్టుబట్టారు. సుమారు 2 గంటల పాటు రాస్తారోకో చేయడంతో హైవేపై 2 కిలోమీటర్ల వరకు మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని సీఐ ఆసిఫాబాద్‌ సీఐ సతీశ్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.