కాకా హయాంలోనే లెదర్ పార్కుల ఏర్పాటుకు కృషి: ఎమ్మెల్యే వివేక్

చెన్నూర్: మాజీ కేంద్రమంత్రి కాకా వెంకటస్వామి హయాంలో లిడ్ క్యాప్ ద్వారా లెదర్ పార్కుల ఏర్పాటుకు చొరవ చూపారని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. ఎస్సీ చర్మకారులకు ఉపాధి కల్పించేందుకు కాకా వెంకటస్వామి లిడ్ క్యాప్ ద్వారా లెదర్ పార్కులకు కృషి చేశారని గుర్తు చేశారు.  రాష్ట్రంలో లిడ్ క్యాప్‎కు విలువైన భూములు ఉన్నాయని.. ఆ భూముల్లో అసంపూర్తిగా ఉన్న లెదర్ పార్క్‎లను పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డితో  మాట్లాడానని చెప్పారు. కులగణన తర్వాత దీనిపై మరోసారి చర్చిద్దామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. 

పది లక్షలతో లెదర్ పార్క్ భవనం పూర్తి చేశారని.. మరో 20 లక్షలను డీఎంఎఫ్టీ ఫండ్స్ నుంచి కేటాయిస్తున్నాని పేర్కొన్నారు. లెదర్ పార్క్ భూమిలో సింగరేణి సోలార్ ప్లాంట్‎కు భూమి కేటాయించిన అంశంపై సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి లెదర్ పార్క్ స్థలానికి నష్టం కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. మందమర్రి మున్సిపాలిటీ 6, 7, 10 వార్డులు.. నార్లపూర్, ఊరు రామకృష్ణాపూర్, 3వ జోన్, దొరల బంగ్లా ఏరియాలో బుధవారం (నవంబర్ 6) ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. 

వార్డుల్లో తిరుగుతూ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సంబంధిత సమస్య ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. మందమర్రిలో ఆ సంపూర్తిగా ఉన్న లెదర్ పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా లెదర్ పార్క్ భూమి మీదుగా సోలార్ ప్లాంట్‎కు వెళ్లేందుకు తీసిన దారిని పరిశీలించారు. లెదర్ పార్క్ భూములు ఆక్రమించుకుంటున్నారని సింగరేణిపై దళిత సంఘాలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. వెంటనే సింగరేణి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి  కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్ భరోసా కల్పించారు.