త్వరలోనే కేసీఆర్‌‌ ఇంటికి ఈడీ : రఘునందన్ రావు

హైదరాబాద్, వెలుగు: త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్‌‌ ఇంటికి ఎన్​ఫోర్స్​మెంట్​డైరెక్టరేట్​(ఈడీ) వస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రాష్ట్రంలో గొర్రెల స్కాం, ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో అరెస్ట్‌‌ అయిన అధికారులంతా మాజీ సీఎం కేసీఆర్‌‌ పేరే చెప్తున్నారని, అన్ని వేళ్లు అతనివైపే చూపిస్తున్నాయని పేర్కొన్నారు. శనివారం అమీర్ పేట్ లోని ఓ హోటల్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్​ పార్టీ టైటానిక్ షిప్ లా మునిగిపోతుందని, ఆ పార్టీ గురించి ఇక చరిత్రలో రాసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. బీఆర్ఎస్​కు సీఆర్ఎస్​(కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం) ఖాయమన్నారు. కేసీఆర్, హరీశ్ రావు ఎవరు వచ్చినా బీజేపీలోకి స్వాగతిస్తామన్నారు. కండువా కప్పుకున్న రోజు నుంచే నేను పార్టీ కార్యకర్తనని, పార్టీ అధిష్ఠానం ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని అన్నారు. కొత్తగా వచ్చిన నేతలకు పదవి రాదు అనేది ఏమి లేదని, అలా అనుకుంటే హిమంత బిశ్వశర్మకు అస్సాం సీఎం పదవి వచ్చేది కాదన్నారు. పనిచేసిన వారికి బీజేపీలో సముచిత స్థానం లభిస్తుందన్నారు. ఓ కార్పొరేటర్ నుంచి వచ్చిన బండి సంజయ్.. ఇప్పుడు కేంద్రమంత్రి అయ్యారన్నారు. పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారంపైనా ఆయన స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. రాజాసింగ్ తన అభిప్రాయం చెప్పారన్నారు. నీట్ పరీక్షపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం అన్ని వివరాలు ఉంచబోతోందన్నారు. 

మెదక్ ను అన్నిరకాలుగా డెవలప్ చేస్తానని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని రఘునందన్​రావు అన్నారు. క్షీరసాగర్ నుంచే తన పని మొదలుపెడతానని చెప్పారు. దళితుల భూములు వారికి అప్పగించేందుకు కృషి చేస్తానన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు గైడ్ లైన్స్ అన్ని అమలు చేశామని, ఈ ప్రాజెక్టు టెక్నికల్ గా మాత్రమే రద్దు అయ్యిందన్నారు. ఐటీఐఆర్ గురించి తెలిస్తే జగ్గారెడ్డితో చర్చకు సిద్ధమన్నారు.  జగ్గారెడ్డి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఉందని రఘునందన్​రావు అన్నారు. జగ్గారెడ్డి పెరిగింది ఆర్ఎస్​ఎస్, ఆయన మొదట గెలిచింది బీజేపీ నుంచేనన్నారు.  మెదక్ కు ఇందిరమ్మ రాకముందే బీహెచ్ఈఎల్, ఇక్రిశాట్ వచ్చాయన్నారు. బయ్యారం, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఫీజుబిలిటీ,  ఫాజిబులిటీ లేదని ఎక్స్​పర్ట్ కమిటీ స్పష్టం చేసిందన్నారు. ప్రజాక్షేత్రంలో గెలిచేందుకు డబ్బులు అవసరం లేదని, ప్రజల పక్షాన నిలబడితే చాలన్నారు. తనపై పోటీ చేసిన వెంకట్రామిరెడ్డి లక్షల కోట్లు సంపాదించాడని, ఎన్నికల్లో ఒక్కో ఓటుకి వెయ్యి రూపాయలు ఇచ్చినా ఓటమి తప్పలేదన్నారు.