ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అక్రమాస్తులపై ఈడీ ప్రకటన

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో  జూన్ 20న ఈడీ సోదాలు చేసింది. పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి మహిపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, ఆఫీసులు,  ఇళ్లోనూ తనిఖీలు జరిగాయి.

 తెల్లవారుజామున 4 గంటల నుంచి మొత్తం మూడు చోట్ల రెయిడ్స్ కొనసాగాయి. ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధు ఇంట్లో  సోదాలు చేసింది ఈడీ. మహిపాల్ రెడ్డి వ్యాపార లావాదేవీలు, అకౌంట్స్, మనీ ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీశారు అధికారులు. శుక్రవారం సోదాలపై ఈడీ ప్రకటన విడుదల చేసింది.

పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి  మైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, మనీలాండరింగ్, హవాలా నేపథ్యంలో సోదాలు జరిగాయి. సంతోష్ స్యాండ్, సంతోష్‌ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు జరిగాయని ఈడీ తెలిపింది. రూ.300 కోట్లలో మైనింగ్ అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి రూ.39 కోట్లు నష్టం చేకూర్చారు. 

బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీలు,అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు తనిఖీల్లో తేలింది. సోదాలు జరిగినప్పుడు ఈడీ అధికారులు రూ.19 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. మధుసూదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డికి పలువురు బినామీలుగా ఉన్నారని అధికారులు అనుమానిస్తున్నారు. వారికి సంబంధించిన కొన్ని బ్యాంక్ లాకర్స్‌ను ఇంకా తెరవాల్సి ఉందని ఈడీ అధికారులు తెలిపారు.