బాసరలో నేడే మూలనక్షత్ర వేడుక

  • భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు 

బాసర, వెలుగు:  బాసర జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి సన్నిధిలో జన్మ నక్షత్రం (మూల నక్షత్రం) సందర్భంగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. బుధవారం మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస పూజలు జరిపించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో విజయరామారావు తెలిపారు.  ప్రత్యేక అక్షరాభ్యాస మండపం, రూ. 150 అక్షరాభ్యాస మండపాలు ఏర్పాటు చేశారు.

అమ్మవారి సర్వ దర్శనానికి, రూ.150 అక్షరాభ్యాస పూజలకు ఆలయ అతిథి గృహాల నుంచి రహదారిపై  పోలీస్ స్టేషన్ వైపు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు.  ఆలయాల అతిథి గదుల వద్ద నుంచి ప్రత్యేక రూ. వెయ్యి అక్షరాభ్యాస పూజ,రూ. 100 స్పెషల్ దర్శనానికి క్యూ లైన్ ఏర్పాట్లు చేశారు.  అమ్మవారికి పట్టు వస్త్రాలను దేవాదాయశాఖ తరపున అందించబోతున్నారు. రూ. వెయ్యి ప్రత్యేక అక్షరాభ్యాస పూజ టికెట్లను టి పోలియో యాప్ ద్వారా ఆన్​లైన్​లో బుక్ చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఆన్​లైన్​లో టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ను ఆలయ అధికారులుఏర్పాటు చేశారు. 

భారీగా పోలీస్ బందోబస్తు....

బాసరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని నిర్మల్​ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ఆదేశించారు.  బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముథోల్ సీఐ మల్లేశ్, బాసర ఎస్ ఐ గణేశ్ పోలీసు సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థ సభ్యులు, తదితరులు బందోబస్తులో ఉండనున్నారు.