- కాగజ్ నగర్ లో ఘటన
- బస్టాండ్‌లో మరోసారి గొడవ
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
కాగజ్ నగర్, వెలుగు: నన్నే పక్కకు జరగమంటావా అంటూ ఓ బస్ డ్రైవర్‌పై ఓ యువకుడు మద్యం మత్తులో దాడి చేశాడు. శనివారం సాయంత్రం కాగజ్ నగర్ బస్టాండ్‌లో ఈ ఘటన జరిగింది. మంచిర్యాల డిపోకు చెందిన ఓ బస్సు సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో మంచిర్యాల నుంచి కాగజ్ నగర్‌కు వచ్చింది. ఈ క్రమంలో బస్టాండ్‌కు వెళ్లే మూల మలుపు కమాన్ వద్ద బస్ తిరుగుతుండగా పట్టణానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి బైక్‌పై బస్‌కు ఎదురుగా వచ్చి నిలిపాడు. దీంతో బస్సు ముందుకు కదలలేని పరిస్థితిలో బైక్‌ను పక్కకు జరపాలని బస్ డ్రైవర్ ఆసిఫ్ ఆ యువకుడిని కోరారు.
దీంతో మద్యం మత్తులో ఉన్న శేఖర్ డ్రైవర్‌తో గొడవ పడి నాకే సైడ్ ఇవ్వవా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. చివరకు డ్రైవర్ బస్సును బస్టాండ్‌లో నిలిపి మంచిర్యాల కి తిరిగి వెళ్లేందుకు పాయింట్ మీదకు వెళ్తుండగా శేఖర్ మరో వ్యక్తి గణేశ్‌ను తీసుకొనివచ్చి ఆసిఫ్‌తో మళ్లీ గొడవ పడి, దాడి చేశారు. ప్రయాణి కులు చూస్తుండగానే దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆసిఫ్‌కు పలు చోట్ల గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిద్దరిని స్టేషన్‌కు తరలించారు. విచారణ జరుపుతున్నామని టౌన్ సీఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.