శ్రావణి మృతిపై అనుమానాలు ఉన్నాయ్

  • మల్లారెడ్డి కాలేజీపై చర్యలు తీసుకోవాలి
  • గాంధీ మార్చురీ వద్ద బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన

పద్మారావునగర్, వెలుగు: బీటెక్ విద్యార్థిని శ్రావణి మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని బాధిత కుటుంబసభ్యులు గాంధీ మార్చురీ ఎదుట శనివారం ఆందోళన చేపట్టారు. మల్లారెడ్డి కాలేజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దుండిగల్ పీఎస్​పరిధిలోని ఎంఎల్ఆర్ఐటీ కాలేజీలో బీటెక్ ఫస్టియర్ స్టూడెంట్ శ్రావణి (18) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 

అయితే, కడుపునొప్పి భరించలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుందని కాలేజీ యాజమాన్యం చెప్పడం సరికాదని, అసలు ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదన్నారు. శ్రావణి మృతిపై పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. తాము వచ్చేవరకు ఆగకుండా డెడ్ బాడీని గాంధీకి తరలించారన్నారు. 

ఇంటర్​లో వికారాబాద్ ​జిల్లాలోనే శ్రావణి టాపర్ ​అని, ఇంజినీరింగ్​లో ఫ్రీ సీటు వచ్చిందన్నారు. హాస్టల్ ఫీజ్​రూ.1.50 లక్షలు ఇచ్చే వరకు కాలేజీ వాళ్లు తమను ఇబ్బంది చేశారన్నారు. తమ బిడ్డను చదివించింది చనిపోవడానికా?  అంటూ తండ్రి బలరాం నాయక్​, తల్లి కవిత బాయి కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా,  పోస్టుమార్టం తర్వాత శ్రావణి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.