రాజేంద్రనగర్ లో హైడ్రా తరహా యాక్షన్..అత్తాపూర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

జీహెచ్ ఎంసీ పరిధిలో హైడ్రా తరహాలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇటీవల హైకోర్టు ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ  అసిస్టెంట్ కమిషనర్.. రాజేంద్రనగర్ సర్కిల్ లోని అత్తాపూర్ లో గురువారం (జనవరి 9 2025) కూల్చేవేతలు చేపట్టారు. 

అత్తాపూర్ పరిధిలోని 400 కోట్ల విలువైన దేవాదాయ భూములు కబ్జాకు గురైనట్లు గుర్తించిన ఆ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో వెలసిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. జేసీబీలతో అక్రమంగా వెలిసిన షెడ్డులను తొలగిస్తున్నారు అధికారులు. 

అయితే రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లోని అనంతర పద్మనాభ సవామి ఆలయానికి సంబంధించిన భూములు కబ్జాకు గురైనట్టు దేవాదాయశాఖ గుర్తించింది.కబ్జా చేసినవారికి పలుమార్లు నోటీసులు జారీ చేశారు. 

నోటీసులకు స్పందించకపోవడంతో అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ ఆధ్వర్యంలో ఆ స్థలంలో వెలసిన నిర్మాణాలను భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. అయితే కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. ఈ భూములకు సంబంధించి కేసులు కోర్టులో పెండింగ్ ఉండగా ఎలా కూలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వానికి దిగారు.