రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ​పరిధిలోని ఓ ఇంజినీరింగ్​ కాలేజీలో భారీ చోరీ

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ​పరిధిలోని ఓ ఇంజినీరింగ్​ కాలేజీలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి టైంలో గుర్తుతెలియని వ్యక్తులు కాలేజీలోకి చొరబడి ఆఫీస్​ రూమ్​లో దాచిన రూ.15.24లక్షలు ఎత్తుకెళ్లారు. సీఐ పవన్ కుమార్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్​సాగర్​రోడ్డులోని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కాలేజీలోకి మంగళవారం అర్ధరాత్రి తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. 

కిటికీ గ్రిల్స్​ తొలగించి ఆఫీస్​రూమ్లోకి వెళ్లారు. అక్కడి లాకర్​పక్కనే ఉన్న తాళం చెవితో లాకర్​ను ఓపెన్​చేశారు. అందులోని రూ.15.24 లక్షలతో పరారయ్యారు. బుధవారం ఉదయం కాలేజీకి వచ్చి ఆఫీస్​సిబ్బందికి లాకర్​లోని డబ్బు కనిపించలేదు. వెంటనే మేనేజ్​మెంట్​దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీంతోపాటు సీసీఎస్ పోలీసులను రంగంలోనికి దింపారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ పవన్​కుమార్​రెడ్డి తెలిపారు.

మెడికల్​ కాలేజీలో అగ్ని ప్రమాదం
మొయినాబాద్​లోని భాస్కర మెడికల్​కాలేజీ హాస్టల్​లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్​ కారణంగా స్టూడెంట్లకు చెందిన ఫోన్లు, బుక్స్,​ ఇతర సామాగ్రి కాలి బూడిదైంది.