రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ కాంగ్రెస్ ఇన్‌చార్జి కొండా సురేఖ అన్నారు. ఈ రెండు పార్టీలు కల్లబొల్లి మాటలు చెబుతూ మరోసారి మన ముందుకు వస్తున్నాయని, ప్రజలు వారి మాటలు నమ్మి ఆగం కావొద్దని సూచించారు. ఆదివారం మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారంలో భాగంగా అమీన్‌పూర్, గుమ్మడిదల మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రోడ్ షోలో కొండా సురేఖ మాట్లాడారు.
అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడలేని వ్యక్తి ఎన్నికలు రాగానే టీవీల ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. యాత్రల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నీలం మధు మాట్లాడుతూ.. ప్రజాసేవ చేసే భాగ్యం కల్పించాలని ప్రజలను కోరారు. మెదక్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు భీరంగూడ గుట్టపై ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. కాగా, రోడ్ షోలో మంత్రి కొండా సురేఖ సమక్షంలో అమీన్ పూర్ మున్సిపాలిటీకి చెందిన పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు.