కుక్కల నియంత్రణకు చర్యలేవి..?

  • పిల్లలపై రెచ్చిపోతున్న శునకాలు
  • 15 రోజుల వ్యవధిలో 9 ఘటనలు
  •  ఒకరు మృతి, 11 మందికి గాయాలు
  • తెల్లాపూర్ లో 20 గొర్రెలు మృత్యువాత

సంగారెడ్డి, వెలుగు: జిల్లా వ్యాప్తంగా చిన్న పిల్లలపై కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. గడిచిన 15 రోజుల్లో 9 సంఘటనలు జరిగాయి. ఇందులో ఆరేళ్ల పిల్లాడు చనిపోగా, నలుగురి పరిస్థితి సీరియస్​గా ఉండగా ఆరుగురు గాయపడ్డారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో గొర్రెలపై దాడి చేయగా 20 గొర్రెలు అక్కడికక్కడే చనిపోయాయి. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ లో జూన్ 30న బిహార్‌‌ వలస దంపతుల ఆరేళ్ల బాలుడు విశాల్ పై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. అదే రోజు ముత్తంగిలో మరో 8 ఏళ్ల బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

వారం రోజుల కింద సంగారెడ్డి మున్సిపల్ 12వ వార్డులో ఆరేళ్ల బాలుడిని ఆరు కుక్కలు చుట్టుముట్టి దాడి చేస్తుండగా చుట్టుపక్కల ప్రజలు గమనించి వాటిని తరిమేశారు. జహీరాబాద్, నారాయణఖేడ్, సదాశివపేట, ప్రాంతాల్లో కూడా వీధి కుక్కలు మహిళలపై దాడి చేసి గాయపరిచాయి. ఈ ఘటనలు మరువకముందే తాజాగా బుధవారం సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ లో మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల దాడుల నేపథ్యంలో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌‌దాఖలు చేయగా అందుకు హైకోర్టు స్పందిస్తూ కుక్కలు దాడులు చేస్తుంటే పట్టించుకోరా అని సంబంధిత అధికారులపై సీరియస్ అయింది. వీధికుక్కల నియంత్రణకు వారంలోగా నిపుణుల కమిటీ వేయాలని అధికారులను ఆదేశించింది.

కుక్కల నియంత్రణకు ప్రతి మున్సిపాలిటీల్లో స్పెషల్ ఫండ్స్ కేటాయించారు. వీటిని కుక్కలను పట్టుకోవడానికి ఉపయోగించి జనవాసాలకు దూరంగా వదిలి పెట్టాలి. కానీ ఎక్కడా అలాంటి చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. పైగా వాటి నియంత్రణకు మాత్రం అధికారులు ఫండ్స్ ఖర్చు చేస్తున్నట్టు లెక్కలు చూపిస్తున్నారు. బయట మాత్రం శునకాలు స్వైర విహారం చేస్తూ జనాలపై దాడులు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను ఇంటి నుంచి బయటికి పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. 

వీధి కుక్కలకు నో వ్యాక్సిన్

పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వీధుల వెంట తిరిగే కుక్కలకు వ్యాక్సిన్లు వేయడం లేదు. వీటి నియంత్రణకు సరైన చర్యలు తీసుకోకపోవడంతో జనాలపై దాడులు చేస్తున్నాయని హైకోర్టులో దాఖలైన పిటిషన్ లో పేర్కొన్నారు. జిల్లాలో వీధి కుక్కలు వరుసగా దాడులు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.