కడుపునొప్పితో హాస్పిటల్‌‌‌‌లో చేరిన మహిళ .. వారంలో మూడు సర్జరీలు చేసిన డాక్టర్లు

  • పరిస్థితి విషమించడంతో రూ. 10 లక్షలు ఇచ్చి హైదరాబాద్‌‌‌‌కు పంపిన వైనం
  • ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ నెల రోజుల తర్వాత మృతి
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌‌‌‌ను కలిసిన కుటుంబ సభ్యులు

మంచిర్యాల, వెలుగు : ‘కడుపులో గడ్డ అయిందని ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు వారం రోజుల్లోనే మూడు సర్జరీలు చేసిన్రు.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రూ. 10 లక్షలు ఇచ్చి హైదరాబాద్‌‌‌‌కు పంపించారు.. అక్కడ నెల రోజులుగా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ మహిళ చనిపోయింది’. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు సోమవారం కలెక్టర్‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... బెల్లంపల్లిలోని పోస్టాఫీస్ బస్తీకి చెందిన శివిని ఆమని (42) మున్సిపాలిటీలో ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ వర్కర్‌‌‌‌గా పనిచేస్తోంది.

 కడుపునొప్పితో బాధపడుతూ అక్టోబర్‌‌‌‌ 15న మంచిర్యాల జన్మభూమి నగర్‌‌‌‌లోని టచ్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో చేరింది. పరీక్షించిన డాక్టర్లు కడుపులో గడ్డ ఉందంటూ 15న ఆపరేషన్‌‌‌‌ చేశారు. తర్వాత ఇన్ఫెక్షన్‌‌‌‌ వచ్చిందని 17న, పరిస్థితి విషమించిందని 24న మూడో సారి ఆపరేషన్‌‌‌‌ చేసి, కుటుంబ సభ్యులకు చెప్పకుండానే వెంటిలెటర్‌‌‌‌పై పెట్టారు. తర్వాత పరిస్థితి మరింత క్షీణించడంతో హైదరాబాద్‌‌‌‌కు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసేందుకు డీఎంహెచ్‌‌‌‌వో మంచిర్యాల గవర్నమెంట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌ డాక్టర్లతో కమిటీ వేశారు. 

ఆ రిపోర్ట్‌‌‌‌ రాకుండానే సూపర్‌‌‌‌ స్పెషాలిటీ డాక్టర్లతో ఎంక్వైరీ కమిటీ వేయాలని కోరుతూ గాంధీ హాస్పిటల్‌‌‌‌కు లెటర్‌‌‌‌ రాశారు. ఇంతలో ఆమని పరిస్థితి మరింత దిగజారడంతో కుటుంబ సభ్యులకు హాస్పిటల్‌‌‌‌ నిర్వాహకులు రూ. 10 లక్షలు ఇచ్చి హైదరాబాద్‌‌‌‌లోని నిమ్స్‌‌‌‌కు పంపించారు. అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ నవంబర్ 19న ఆమని చనిపోయింది. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఆమని చనిపోయిందని, హాస్పిటల్‌‌‌‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ భర్త అరుణ్‌‌‌‌కుమార్‌‌‌‌, కుమార్తెలు సోని, రుచిత సోమవారం కలెక్టర్‌‌‌‌ను కలిశారు.

 డీఎంహెచ్‌‌‌‌వో ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేసినా రిపోర్టు బయటపెట్టకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై డీఎంహెచ్‌‌‌‌వో హరీశ్‌‌‌‌రాజ్‌‌‌‌ వివరణ కోరగా సూపర్‌‌‌‌ స్పెషాలిటీ డాక్టర్లతో ఎంక్వైరీ కమిటీ వేయాలని గాంధీ హాస్పిటల్‌‌‌‌కు లెటర్‌‌‌‌ రాశామని చెప్పారు. టచ్ హాస్పిటల్‌‌‌‌ నిర్వాహకులు శ్రీనివాస్‌‌‌‌ను సంప్రదించగా ఆమనికి అవసరం మేరకే డాక్టర్లు మూడు ఆపరేషన్లు చేశారని, ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదన్నారు.