రిమ్స్ లో అరుదైన శస్ర్తచికిత్స

  • రోగి పక్కటెముకల్లోని ట్యూమర్ ను తొలగించిన డాక్టర్లు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్ లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు అరుదైన శస్ర్తచికిత్స చేసి రోగికి పక్కటెముకల్లోని క్యాన్సర్ ట్యూమర్​ను తొలగించారు. ఆస్పత్రి డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లాకు చెందిన అభిషేక్ (26) అనే యువకుడు బోన్ క్యాన్సర్​తో బాధపడుతుండడంతో.. ఆంకో సర్జన్(క్యాన్సర్ ప్రత్యేక నిపుణుడు) డా.జక్కుల శ్రీకాంత్ నేతృత్వంలో వైద్య బృందం బాలుడి పక్కటెముకల్లోని గుండెకు, ఊపిరితిత్తులకు అతుక్కొని ఉన్న క్యాన్సర్ కణాలను 7 గంటల పాటు శస్ర్త చికిత్స చేసి తొలగించినట్లు చెప్పారు.

 ఈ సర్జరీని ప్రైవేట్​లో చేయిస్తే రూ.6 లక్షలకు పైగా ఖర్చవుతుందని, రిమ్స్​లో ఉచితంగా చేసినట్లు తెలిపారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో సూపరింటెండెంట్ డా.అశోక్, యూరాలజీ డా.కుమ్మరి కార్తీక్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.